శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 25 మార్చి 2021 (19:47 IST)

గవర్నర్ ప్రశంసలు అందుకున్న డిజిపి గౌతమ్ సవాంగ్

విజయవాడ: దేశంలోనే ఉత్తమ డిజిపిగా స్కోచ్ అవార్డును అందుకున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్‌ను  రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌతమ్ సవాంగ్ ఇటీవలి కాలంలో రాష్ట్ర పోలీసు శాఖ చేజిక్కించుకున్న వివిధ అవార్డులను గురించి వివరించారు. 
 
పోలీసింగ్, ప్రజా భద్రత, రాష్ట్ర పోలీసు శాఖలో సాంకేతిక సంస్కరణలను చేపట్టడం తదితర అంశాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నేపధ్యంలో ఈ జాతీయ స్ధాయి అవార్డులు లభించించాయని డిజిపి తెలిపారు. స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఫిక్కీ బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకున్నామని, ఇంటర్‌జెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) ద్వారా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధాన పరంగా దేశంలోనే అత్యుత్తమమైనదిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైందని డిజిపి పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పురస్కారాలను గెలుచుకోవాలన్నారు. ప్రజా సేవ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ ముందుకు సాగాలన్నారు. డిజిపి సవాంగ్‌తో పాటు అవార్డులకు కారణమైన ఇతర పోలీసు అధికారులను గవర్నర్ శ్రీ హరిచందన్ అభినందించారు. గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డిఐజి (సాంకేతిక సేవలు ) జి. పాలరాజు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.