శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (11:15 IST)

పోలవరం ప్రాజెక్టు రికార్డ్ అదిరింది.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

పోలవరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు కొట్టేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంక్రీట్ పనులను గిన్నిస్‌ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడ్యుకేటర్ రిషిదినాథ్ ప్రారంభించారు. కాంక్రీట్ పనుల్లో శరవేగంగా దూసుకెళ్తూ గిన్నిస్ బుక్ ఆఫర్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.


ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కాంక్రీటు పనులు సోమవారం ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేసి గిన్నీస్ రికార్డును అందుకున్నారు. 
 
ఎముకలు కొరికే చలికి ఏమాత్రం చలించకుండా కార్మికులు విరామం లేకుండా విధుల్లో పాల్గొన్నారు. గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేసి అరుదైన ఘనత సాధించారు. పోలవరంలో రికార్డు కాంక్రీటు పనులు డిసెంబరు 17నే చేపట్టాలని నవయుగ నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే పెథాయ్‌ తుపాను కారణంగా దీన్ని వాయిదా వేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 7)న ఈ పనులు ప్రారంభమయ్యాయి. గిన్నిస్ రికార్డు పనులకు సంబంధించి ఈ సామగ్రిని ముందుగానే సిద్ధం చేశారు. ఏడువేల టన్నుల సిమెంట్, 22వేల టన్నుల ఇసుక, 36వేల టన్నుల కంకరను అందుబాటులో వుంచారు.
 
గిన్నిస్‌ బుక్‌ రికార్డ్సుకు సంబంధించి 24 మంది ఇంజినీర్లతో కూడిన బృందం పనులను పరిశీలించింది. 2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డులను పోలవరం తాజాగా అధిగమించింది.