శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2017 (18:52 IST)

అసెంబ్లీ కమిటీ సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... స్పీకర్ కోడెల

అమరావతి: శాసనసభ కమిటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ భవనం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ), పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ (పీయుసీ),

అమరావతి: శాసనసభ కమిటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ భవనం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ), పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ (పీయుసీ),  ఎస్టిమేట్స్ కమిటీల తొలి సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు సమస్యలు, సౌకర్యాలతోపాటు పలు అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. 
 
స్పీకర్ కంటే ముందు తాను శాసనసభ్యుడినని, కమిటీ సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. సభ్యుల మనోభావాలను గౌరవిస్తానని చెప్పారు. శాసనసభ కమిటీలు 19 వరకు ఉన్నాయని, వాటిలో దేని ప్రాధాన్యత దానిదేనని, అయితే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఈ మూడు కమిటీలు కీలకమైనవని అన్నారు. సభ్యులలో కొంతమంది పాతవారితోపాటు కొత్తవారు కూడా ఉన్నారు. 
 
కమిటీలు పని చేసే విధానం, నియమ నిబంధనలు వివరించారు. ఈ కమిటీల సభ్యులు ఎవరూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశం లేదని చెప్పారు. కమిటీ సభ్యులు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసే నిధులు, అక్కడ జరిగే పనులను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని తెలిపారు. అన్ని అంశాలలో కమిటీ సభ్యులకు తాను పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. కమిటీలకు రూమ్‌లు కేటాయించడానికి తగిన స్థలం లేదని, పక్కన కొత్తగా నిర్మించే భవనంలో రూమ్‌లు కేటాయించడానికి ప్రయత్నిస్తానని స్పీకర్ చెప్పారు.
 
కమిటీ సభ్యులు ఏదైనా పర్యటనకు వెళ్లడానికి 15 రోజులు ముందు చెబితే సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందని శాసన సభ స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు చెప్పారు. సమావేశంలో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కాగిత వెంకటరావు, మూడు కమిటీల సభ్యులు,  పూర్వకార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.