హస్తినలో సీఎం చంద్రబాబు... నేడు ప్రధాని మోడీతో భేటీ!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ భేటీ సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. తన పర్యటనలో భాగంగా, రెండో రోజైన అక్టోబరు 8వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌లతో సమావేశమవుతారు.
ఇటీవల సంభవించిన విజయవాడ వరదల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. దాంతో వరద సాయం విడుదల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడటం తదితర అంశాలను సీఎం చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించనున్నారు.