వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు.. సీఎం జగన్ అనంతపురం టూర్ రద్దు
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయన్ను పులివెందుల నుంచి హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ అరెస్టుతో పులివెందులతో పాటు కడప జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు, వైకాపా అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనను రద్దు ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. ఆయన సోమవారం జిల్లాలోని శింగనమలలో పర్యటించాల్సివుంది. ఈ కార్యక్రమం రద్దు అయినట్టుగా ప్రకటించారు. అదేసమయంలో సోమవారం విజయవాడ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొంటారని వెల్లడించారు.
ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకావాల్సివుంది. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కంప్యూటర్ బటన్ నొక్కేందుకు అక్కడకు వచ్చేలా టూర్ షెడ్యూల్ ఖరారైంది.
అయితే, అనివార్య కారణాల రీత్యా ఈ కార్యక్రమం రద్దు అయినట్టు ప్రకటించారు. దీన్ని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసినట్టు సీఎంవో అధికారులు ప్రకటించారు. సోమవారం సాయంత్రం విజయవాడలో మాత్రం సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
అయితే, సీఎం జగన్ పర్యటన రద్దుకు అనివార్య కారణాలు అని సీఎంవో ప్రకటించినప్పటికీ ప్రధాన కారణం మాత్రం వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడమేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమితో షాక్‌కు గురైన జగన్.. తన అనంతపురం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం.