టీచర్ల బదిలీల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండరాదు : మంత్రి నారా లోకేశ్
టీచర్ల బదిలీల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండరాదని ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విధివిధానాలను రూపొందించాలని విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని కోరారు. చిల్డ్రన్ లెర్నింగ్ ఔట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్యుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు.