సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (19:42 IST)

మా ప్రభుత్వ పనితీరు బాగోలేదు : మంత్రి పేర్ని నాని అసహనం

perni nani
వైకాపాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని సొంత ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. కలెక్టర్‌పై మండిపడ్డారు. నియంతలా వ్యవహరించవద్దంటూ హెచ్చరించారు. బరితెగింపుతనం ఏ ఒక్క అధికారికి మంచిదికాదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఇందులో కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరుకాలేదు. దీంతో మాజీ మంత్రి పేర్ని నానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి రాకుంటే ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపడుతామని పేర్కొంటూ కలెక్టర్‌కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్ పర్సన్‌కు ఆయన సూచించారు. 
 
జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశ్యం కలెక్టర్‌కు లేదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను లెక్కచేయకపోవడం సరికాదని, నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి కూడా మంచిదికాదన్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. సొంత ప్రభుత్వ అధికారుల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.