వివేకా హత్య కేసుపై మాట్లాడరాదా? 8లోపు నతగు నిర్ణయం తీసుకోండి... కింది కోర్టుకు హైకోర్టు
మాజీ మంత్రి, వైకాపా నేత దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎన్నికల్లో ప్రస్తావించరాదంటూ కడప జిల్లా కోర్టు జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 8వ తేదీలోపు తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
వివేకా హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 16వ తేదీన జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
పిటిషనర్ల తరపున మురళీధర్‌రావు, గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా కోర్టులో కూడా సునీత తదితరులు అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపి, ఈనెల 8వ తేదీలోపు తగు నిర్ణయం తీసుకోవాలని జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.