10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు-ఏపీలో మొదలైన పోలింగ్
ఏపీలో వరుసగా మూడోరోజు ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం, సోమవారం పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. నేడు ఏపీలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
పలు కారణాలతో గతంలో ఆగిపోయిన చోట్ల, గెలిచిన అభ్యర్థులు మరణించిన స్థానాల్లో మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను రీపోలింగ్ మొదలైంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 954 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
నేడు ఏదైనా అవకతవకలు జరిగితే బుధవారం రీ పోలింగ్ నిర్వహడానికి ఏపీ ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థుల పేర్లు ప్రటిస్తారు. మొత్తం 7 వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఏపీ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉన్న 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, కృష్ణాలో 3, గుంటూరులో 1, చిత్తూరులో 1, కర్నూలులో 1, అనంతపురంలో ఒక్క జెడ్పీటీసీ స్థానాలకు 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.