ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (14:28 IST)

ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి : కలిసి పోటీ చేస్తున్న టీడీపీ - వైకాపా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వచ్చే 2019 ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వచ్చే 2019 ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మరోవైపు అధికార టీడీపీ నేతలు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఊరూవాడా తిరుగుతున్నారు. ఇంకోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోరాట యాత్ర పేరుతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ, టీడీపీ, వైకాపాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) గుర్తింపు ఎన్నికల్లో వైకాపా, టీడీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఎన్ఎంయూ (నేషనల్ మజ్దూర్ యూనియన్)ను ఓడించేందుకు టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్, వైసీపీ అనుబంధ వైఎస్ఆర్ ఆర్టీసీ ఏకమయ్యాయి. వీరితో పాటు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కూడా కలసి వచ్చింది. రాజకీయాల్లో భాగంగా నిత్యమూ కత్తులు దువ్వుకునే టీడీపీ, వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
 
అయితే, కార్మిక సంఘాల విషయానికి వచ్చే సరికి ఈ రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తుండటం చాలా ఆసక్తిని కలిగిస్తోంది. టీడీపీకి అనుబంధంగా ఉన్న టీఎన్టీయూసీ (తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌)కు అనుబంధంగా కార్మిక పరిషత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆర్టీసీలో కార్మిక పరిషత్ బలం తక్కువ. దీంతో కార్మిక పరిషత్‌ను, ఎన్ఎంయూను విలీనం చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఎన్ఎంయూ ఉంటుందన్న ఆలోచనలో ఉన్న టీడీపీ నేతలు, ఆ సంఘాన్ని పూర్తిగా విశ్వసించలేమన్న భావనతో విలీనం ఆలోచనలకు స్వస్తి పలికారు. 
 
అయితే, ఈ పొత్తుపై అధికారిక ప్రకటన లేకున్నా, తాము ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ)తో పొత్తు పెట్టుకున్నామని, ఈయూలో వైఎస్ఆర్ ఆర్టీసీ ఒక భాగమేతప్ప, తామేమీ వైసీపీతో పొత్తు పెట్టుకోలేదని కార్మిక పరిషత్‌ ప్రధానకార్యదర్శి వి.వరహాల నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం.