శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:27 IST)

ఆర్టీసీ సమ్మె విరమణ... ఎన్నికల తాయిలమే...

ఎన్నికల సీజన్ అడక్కుండానే డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమలంటూ, నిరుద్యోగ భృతి పెంపు అంటూ దాదాపు అన్ని వర్గాలను కలుపుకుపోవాలని కోరుకుంటున్న చంద్రన్న ఆర్టీసీని మాత్రం ఎందుకు వదులుకుంటాడు... దాదాపు 55వేల మందికి పైచిలుకు ఉద్యోగులు ఉన్న ఆ సంస్థ సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే ఆర్టీసీ సమ్మెని విరమింపచేయడానికి తెలుగుదేశం పార్టీ ముందస్తు వ్యూహంతోనే రంగంలోకి దిగింది. నోటీసు ఇచ్చినరోజు నుండి.. కాలయాపన చేస్తూ, చివరకు కొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కాబోతోంది అనగా... అప్పటికప్పుడు ఫిట్‍‌మెంట్‌పై ప్రకటన చేసేసి చప్పట్లు కొట్టించుకునేసింది.
 
అయితే... ఇదంతా చంద్రన్నకి ఓటర్లు మరియు వారి ఓట్లు మీదున్న ప్రేమే కానీ, ఉద్యోగుల మీదున్న ప్రేమాభిమానాలు కాదనేది జగమెరిగిన సత్యమే. వాస్తవానికి చంద్రబాబుకు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ ఫిట్‌మెంట్‌ని మూడేళ్ల కిందటే ప్రకటించి ఉండేవారు. అయితే... చంద్రబాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎమ్మెల్యే దాడిలో అవమానాలు ఎదుర్కొన్న మహిళా రెవెన్యూ ఉద్యోగిని విషయాన్ని గమనిస్తేనే అందరికీ అర్థమైపోతుంది.
 
ఉద్యోగులపై ఇంతటి 'ప్రేమాభిమానాలు' చూపించేస్తున్న చంద్రబాబు, ఆర్టీసీ కార్మికులపై కలలో కూడా ఊహించని ఔదార్యం చూపించారంటే ఎవరైనా నమ్ముతారా. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే తాత్కాలికంగా 25శాతం ఫిట్‌మెంట్‌ని ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే... వేతన సవరణ బకాయిల మాట మాత్రం దాటవేసేసారు. 2020 నాటికి వేతన సవరణ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పిన ఆయన అంటే మళ్లీ అధికారంలోకి వస్తేనే ఇస్తానన్నట్లు చెప్పకనే చెప్పారు, వచ్చినప్పటికీ ఇస్తారన్న హామీ ఏమీ లేదన్న మాట కూడా ఇక్కడ వాస్తవ దూరమేమీ కాదు.
 
ఎట్టకేలకు ఆర్టీసీ వాళ్లక్కూడా ఏదో ఇచ్చేస్తున్నామని ప్రకటించేసిన బాబుగారు ఇంకా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో లెక్కలేసుకుంటూ ఉంటారు...