శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (16:37 IST)

డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్‌కు అరెస్ట్ వారెంటు జారీ

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు అరెస్ట్ వారెంటు జారీ అయ్యింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేఏ పాల్ డేవిడ్ రాజు హత్య కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. కేఏ పాల్ విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసింది. 
 
కేఏ పాల్ తమ్ముడైన డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. కారు ముందు సీట్లో డేవిడ్ రాజు శవం పడి ఉండటం అప్పట్లో సంచలనం అయ్యింది.
 
పోలీసులు మొదట దానిని గుర్తుతెలియని శవంగా భావించినప్పటికీ, ఆ తర్వాత కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజుగా గుర్తించారు. డేవిడ్ రాజుకు, కేఏ పాల్‌కి మధ్య తలెత్తిన ఆస్తి తగాదాల కారణంగానే పాల్ డేవిడ్ రాజును హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు పలుమార్లు పాల్‌కి నోటీసులు పంపినప్పటికీ, కేఏ పాల్ స్పందించకపోవడంతో ఈసారి అరెస్ట్ వారెంటు జారీ చేసింది.