శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (14:24 IST)

టీడీపీకి రాజీనామా... అదేం లేదంటున్న అశోక్ గజపతి రాజు

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇందులోభాగంగా, సీనియర్ నేత అశోక గజపతి రాజు కూడా పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై ఆయన స్పదించించారు.
 
విజయనగరం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను ఏపీ ముఖ్యమంత్రిపై అలిగినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తాను టీడీపీ కార్యకర్తననీ, 1982 నుంచి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానన్నారు. 
 
చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేదా భేదాభిప్రాయాలు లేవనీ, ఇటీవల ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష తర్వాత టీడీపీ అధినేతతో పాటు రాష్ట్రపతిని కలిశానని చెప్పారు. శుక్రవారం తాను విశాఖపట్నం వెళ్లడానికి ఢిల్లీలో విమానం ఎక్కుతుండగా పొలిట్‌బ్యూరో సమావేశం సమాచారం అందిందనీ, అప్పటికప్పుడు ప్రయాణం మార్చుకోలేక గైర్హాజరు కావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. 
 
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశానని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ పార్టీలోకి రావడం తనకిష్టం లేదన్నది వట్టి పుకారేనన్నారు. కిశోర్ చంద్రదేవ్ మంచి వ్యక్తి అనీ, ఆయన పార్టీలోకి రావడం స్వాగతించదగ్గ విషయమేనని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఆ పార్టీని వీడనున్నారనే వార్త ప్రచారం సాగుతోంది. తెలుగు మీడియాలోని కొన్ని పేపర్లు, ఛానెళ్లలో వస్తున్న కథనాలు, వార్తల ప్రకారం, ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్నారు. 
 
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లలో ఒకరైన కిశోర్ చంద్రదేవ్‌ను టీడీపీలోకి చేర్చుకోవడం, ఆయన చేరికపై తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అశోక్ గజపతిరాజు తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారని కూడా సమాచారం.
 
కాగా, 1983 నుంచి టీడీపీలో ఉన్న అశోక్ గజపతిరాజు, వాస్తవానికి చంద్రబాబు కన్నా పార్టీలో సీనియర్ నేత. నిన్న జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఇటీవలి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం శంకుస్థాపనకూ ఆయన గైర్హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న కొన్ని కార్యకలాపాలు తమ నేతకు ఏ మాత్రం నచ్చడం లేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఈ పరిణామాలన్నింటిపై అశోక గజపతిరాజు స్పందించారు.