బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (21:36 IST)

జనరిక్ మెడిసిన్స్‌తో పేదోళ్లకు లబ్ధి: జనచైతన్య వేదిక

పేదోడికి జబ్బు చేస్తే ఖరీదైన మందుల వాడకంతో జేబుకు చిల్లుపడుతుంది. అదే జనరిక్ మందులు వాడకం ద్వారా ఆర్థిక భారం తగ్గి లబ్ధి కలుగుతోందని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.

ప్రైవేటు వైద్యంపై ప్రభుత్వ కసరత్తును ఆయన బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. సామాన్య, మధ్య తరగతికి భారమైన బ్రాండెడ్ మందుల్ని కాదని... జనరిక్ మెడిసిన్‌ను ప్రోత్సహించడంలో ఏపీ మెడికల్ కౌన్సిలింగ్ నిర్ణయం సర్వత్రా హర్షణీయం అన్నారు.

త్వరలో విడుదల కానున్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. నర్సింగ్ హోంలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే ఏ వైద్యుడైనా జనరిక్ డ్రగ్ మందులే రాయాల్సి ఉంటుంద‌న్నారు. పేద,మధ్యతరగతి కుటుంబాల్లో ఆధికశాతం మంది వైద్య చికిత్స, మందులకు వెచ్చిస్తున్న ధన భారం అధికమని తెలియజేశారు.

క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బ్రాండెడ్ మందుల వాడకంతో నెలకు రూ.వేల్లల్లో అదనంగా ఖర్చుపెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఆర్ధికభార విధానాల్ని సంస్కరణల ద్వారా సంపూర్ణంగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.

డాక్టర్లు ఫోటోలతో కూడిన హోర్డింగ్లు, ప్రకటనలు ఇవ్వరాదనే నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యంలో కాస్త మెరుగుదల కనిపిస్తోందన్నారు. అదేవిధంగా వైద్యులు రోగులకు రాసే మెడికల్ ప్రిస్కిప్షన్ కూడా సామాన్యులకు అర్ధమయ్యే విధంగా మందుల పేర్లతో ఉండటం మంచిదని సూచించారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఖరీదైన వైద్యం అందుకోలేక ప్రాణాల మీదికి తెచ్చుకోరాదనే సదుద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం మరింత మెరుగుపరిచిందన్నారు.

చికిత్స అనంతరం కూడా వాడాల్సిన మందులకు ఆర్థికభారం తగ్గించి పేదోడి ఆరోగ్య భరోసాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.