గోదావరి - పాపికొండల నడుమ ప్రారంభమైన బోటింగ్
గోదావరి నది, పాపికొండల మధ్య బోటింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన బోటింగ్‌కు ఏపీ ప్రభుత్వం ఆదివారం నుంచి అనుమతి ఇచ్చింది. దీంతో నేటి నుంచి పాపికొండల మధ్య బోటింగ్ ప్రారంభమైంది.
రాజమండ్రి నుంచి వర్చువల్‌గా పాపికొండల బోట్లను ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. పాపికొండల విహారయాత్ర పర్యవేక్షణకు ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పర్యాటక బోట్లకు ఎస్కార్ట్ బోట్ తప్పని సరిచేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడిచే బోట్లకు కళ్ళెం పడింది.
రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తీవ్రవిషాదం నింపింది. దీంతో యాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది పునఃప్రారంభించారు. వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర ఆదివారంనుంచి ప్రారంభమైంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాపికొండల యాత్రకు వెళ్లాలంటే ఏపీ టూరిజం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలి. సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచే మొదలవుతుంది.