అరేబియా - బంగాళాఖాతాల్లో అల్పపీడనాలు : ఏపీలో అతి భారీవర్షాలు
అరేబియా సముద్రంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటికితోడు ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. వీటి ప్రభావం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. అలాగే, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడివుంది. ఈ నెల 9వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
అలాగే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోంది. ఇది క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ, 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.