1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (21:02 IST)

పిల్లల్లో పుస్తక పఠనం పెంపొందించాలి: పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి

విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటును పెంపొందించాలని పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. శనివారం  సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ‘బాలసాహిత్యం – పాఠశాల గ్రంథాలయం’ అంశంపై జరిగిన ఆన్లైన్ సమావేశంలో 106 మంది రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, రచయితలతో చర్చించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు చదివే పాఠ్య పుస్తకాలైనా, సాహిత్య పుస్తకాలైనా వారి భవిష్యత్తుకు పనికొచ్చేలా ఉండాలన్నారు. విద్యార్థుల్లో కుల, లింగ వివక్షతల గురించి మార్పు తీసుకొస్తూ వారిలో నైతిక విలువలు పెంపొందించాలని కోరారు.

సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు గారు మాట్లాడుతూ పాఠశాల గ్రంథాలయం ఓ విజ్ఞాన భాండాగారమనీ, విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా ఆసక్తిని, అభిరుచిని పెంపొందింపజేయడం ద్వారా మేధస్సు పెరుగుతుందని పిల్లల్లో గ్రంథాలయ ఆవశ్యకతను తెలియజేయాలని ఉపాధ్యాయులను కోరారు.

కళలు, సంప్రదాయాలు, నృత్యాలు, సంగీతం వంటి వాటిని స్పృశిస్తూ  సృజనాత్మక రచనలు తీసుకురావాలని కోరారు. ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణి కె.వెట్రిసెల్వి గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో గల ప్రముఖ వ్యక్తులు, సందర్శన స్థలాలు, పుస్తకాలు, ప్రత్యేక వంటకాలు వంటి విషయాలను గ్రంథస్థం చేసి భవిష్యత్‌రాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు.

స‌మావేశంలో పౌర గ్రంథాలయ డైరెక్టర్ మస్తానయ్య, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాపరెడ్డి, ప్రముఖ రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణ స్వామి, నయీ తాలీమ్ దక్షిణ భారత బాధ్యులు సి.ఏ.ప్రసాద్‌, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, గంటేడ గౌరునాయుడు, చంద్రలత, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.