సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (15:18 IST)

మూడు సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లే, మూడు రాజ‌ధానుల‌ను ర‌ద్దు చేయండి

వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతిస్తున్నామ‌ని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటనలో తెలిపారు. మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీసుకున్న నిర్ణయాన్నితెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోంద‌న్నారు. రైతుల ఆందోళనలకు స్పందించి బిల్లులు వెనక్కు తీసుకోవడం సముచితమైన నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు. 

 
రైతుల సంక్షేమానికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయ‌ని, వాటి మీద దృష్టి పెడుతున్నామ‌ని ప్రధాని మోదీ చెప్పడం అభినందనీయం అని చెప్పారు. అదే సందర్భంలో ఏపీలో 34 వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు 700 రోజులకు పైగా దీక్షల‌ను ప‌ట్టించుకోవాల‌ని చంద్ర‌బాబు కోరారు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు 13 జిల్లాల నుండి పెద్ద స్థాయిలో సంఫీుభావం ప‌లుకుతున్నార‌ని వివ‌రించారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలకు పైగా ఉండాలని, అమరావతి రాజధానికి నాడు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతతో సహా సభ్యులందరూ మద్దతు తెలిపార‌ని గుర్తు చేశారు.  
 

చట్ట ప్రకారం రైతాంగానికి ప్రభుత్వం అగ్రిమెంట్‌ ఇచ్చింద‌ని, అమరావతిని ఏకైక రాజధానిగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తి సమకూరింద‌ని, అమరావతి అభివృద్ధి అయితే 13 జిల్లాల అభివృద్ధికి నిధుల కొరత ఉండద‌ని వివ‌రించారు చంద్రబాబు నాయుడు.


అమరావతి అభివృద్ధితో 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వస్తుంద‌ని, అమరావతి సంపద సృష్టించే, ఉపాధి కల్పన చేసే కేంద్రం అని చంద్ర‌బాబు వివ‌రించారు. మూడు సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొన్న విధంగా, మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించాల‌ని కోరారు.