సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (09:03 IST)

చంద్రబాబు కేసు అప్‌డేట్స్... నేడు ఏసీబీ - సుప్రీంకోర్టుల్లో విచారణ

chandrababu naidu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పలు పిటిషన్లపై బుధవారం విచారణ జరుగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ ఈ పిటిషన్లపై విచారణ జరుగనుంది. తనపై బనాయించిన అక్రమ కేసును కొట్టి వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌ను గత శుక్రవారం దాఖలు చేయగా, మంగళవారం స్వీకరించింది. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్పీఎన్ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61వ ఐటమ్‌గా లిస్టు అయింది. నిజానికి ఈ పిటిషన్‌పై మంగళవారమే విచారణ జరగాల్సివుంది. కానీ, ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవండతో ఈ కేసు ఆయన ముందుకు రాలేదు. అయితే, ఈ కేసును అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇచ్చిన మెన్షనింగ్‌ స్లిప్‌ను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్పీఎన్ భట్ ధర్మాసనం ముందు జాబితా చేసినట్టు తెలుస్తోంది.
 
కాగా, ఈ కేసులో చంద్రబాబు జుడీషియల్ రిమాండ్ రెండుసార్లు పొడిగించడంతో అక్టోబరు 5 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. మరోవైపు, అమరావతి రింగురోడ్డు కేసు విచారణ బుదవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో బెయిలు కోరుతూ టీడీపీ అధినేత ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా, స్కిల్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు చంద్రబాబును మరో ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నేడు విచారణ జరుపనుంది.