ఏపీలో నార్త్ కొరియా పాలన ... రాజారెడ్డి రాజ్యాంగం : లోకేశ్ వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యుగళం పేరుతో కొనసాగిస్తూ వచ్చిన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తన తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడంతో ఈ పాదయాత్రను లోకేశ్ వాయిదా వేశారు.
అయితే, చంద్రబాబుపై బనాయించిన అక్రమ కేసుపై న్యాయపోరాటం చేస్తూనే, ఇటు యువగళం పేరుతో రోడ్డెక్కాలని నారా లోకేశ్ నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసివున్న లోకేశ్... ఆదివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెనస్‌లో మాట్లాడారు. చంద్రబాబు ఆరెస్ట్, రిమాండ్ తదనంతర పరిణామాలపై చర్చించారు. యువగళం పునఃప్రారంభంపై ముఖ్య నేతలతో చర్చించారు.
ఈ వారం నుంచే యువగళం పాదయాత్ర ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, రాష్ట్రంలో ఉత్తర కొరియా తరహా పరిస్థితులు నెలకొన్నాయని నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు చలో రాజమండ్రికి నిర్వహించిన కార్ల ర్యాలీని ఏపీ పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకున్నారు. ముఖ్యంగా, ఏపీ వైపు వెళుతున్న ఓ ఐటీ ఉద్యోగి మొబైల్ ఫోనును తీసుకుని వాట్సాప్‌ను పోలీస్ చెక్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
'ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. పౌరుల ఫోన్లలోని వాట్సాప్‌ను పోలీసులు తనిఖీ చేయడం దారుణం. ఇవి ఆందోళన రేకెత్తించే అంశాలు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి యొక్క గోప్యతను హరించకూడదు. కానీ ఏపీలో అలా జరగడం లేదు. ఉత్తర కొరియా తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కుతున్నారన్నారు' అని లోకేశ్ మండిపడ్డారు.