గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (15:12 IST)

అసెంబ్లీని కౌరవ సభగా మార్చేశారు.. మళ్ళీ అధికారంలోకి వస్తా... : చంద్రబాబు

పవిత్రమైన అసెంబ్లీని వైకాపా ప్రభుత్వ కౌరవ సభగా మార్చివేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన 40 యేళ్ళ సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఇపుడు జరిగిన పరాభవాన్ని కూడా దిగమింగి ప్రజల పక్షాన పోరటం చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 
 
ఆయన ప్రస్తుతం రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తొలి రోజు కడపలో పర్యటించిన చంద్రబాబు రెండో రోజైన బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 
 
అయితే, ఆయన బుధవారం వరద బాధితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కొందరు పోలీసులు తోక జాడిస్తున్నారు. నేను అసెబ్లీకి వెళితే ఎగతాళి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. విశాఖపట్టణం వెళితే అడ్డుకున్నారు. నా ఇంటిపై దాడి చేసేందుకు రౌడీలు వచ్చారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడి చేశారు. నాపై ఉన్న ప్రేమతో మాట్లాడేందుకు రౌడీలు వచ్చారంటూ వైకాపా నేతలు సెటైర్లు వేశారన్నారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. 
 
కుప్పం మున్సిపాలిటీలో వైకాప నేతలు దౌర్జన్యాలకు పాల్పడి గెలుపొందారన్నారు. దొంగ ఓట్లతో గెలిచారు. దొంగ ఓటర్లను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కుప్పంకు నేరస్తులు వచ్చారు. రౌడీయింజం చేసి గెలుపొందారు. వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నింటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ చంద్రబాబు అన్నారు.