బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (18:24 IST)

పులివెందులలో ఆదిత్యా బిర్లా యూనిట్ కి సీఎం జ‌గ‌న్ భూమిపూజ‌

వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కొత్త కంపెనీకి శ్రీకారం చుట్టారు. స్థానిక‌ ఇండస్ట్రియల్ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌(ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) యూనిట్‌ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమంలో సీఎం వైయస్‌.జగన్ పాల్గొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు అలాట్‌మెంట్‌ లెటర్‌ను అందజేశారు. 
 
 
ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ, పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌ లిమిటెడ్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) కార్యక్రమానికి భూమిపూజ సందర్భంగా ఇక్కడకు వచ్చిన సంస్ధ ఎండీ ఆశీష్‌ దీక్షిత్‌కి, సంస్ధ యాజమాన్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

 
పులివెందులలో ఆదిత్యా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం నిజంగా ఓ చరిత్రాత్మక ఘట్టం. ఆదిత్యా బిర్లా గ్రూపు ఫార్చూన్‌ – 500 గ్రూపులో ఒకటిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించే కంపెనీగా 2020 ఫోర్భ్స్‌ గ్రూపు వీరికి గుర్తింపు కూడా ఇచ్చింది. ఉద్యోగులను బాగా చూసుకోవడంతో పాటు అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో కూడా ఈ కంపెనీ మేటి. ప్రపంచంలోనే ఫార్చూన్‌ 500 కంపెనీల్లో ఒకటి. ఇటువంటి మంచి కంపెనీ మన పులివెందుల గడ్డమీదకు రావడం, ఇక్కడ ప్రారంభించడం మంచి బీజం. 
 
 
ఇక్కడ పడే ఈ బీజం దాదాపు 2వేల మందికి ఉద్యోగాలు  ఇచ్చే పరిస్థితి నుంచి ప్రారంభమవుతుంది. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి వీళ్లందరికీ ఇక్కడి వాతావరణంతో పాటు మనం వీళ్లందరినీ చూసుకునే తీరు, మన అక్కచెల్లెమ్మలు బాగా పనిచేసే గుణాలు...ఇవన్నీ ఒక్కటయితే రెండువేల ఉద్యోగాలిచ్చే ఈ సంస్ధ ఒక్క పులివెందులలోనే పదివేల ఉద్యోగాలకు పోయే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది.
 
 
ప్రభుత్వం నిర్మిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలో ఈ స్కిల్స్‌లో కూడా తర్ఫీదు ఇవ్వవలసిందిగా ఆదిత్యా బిర్లా గ్రూప్‌ యాజమాన్యానికి, మా కరికాలవలవెన్(స్పెషల్ సీఎస్‌, ఇండస్ట్రీస్‌), సుబ్రమణ్యం(వీసీ అండ్ ఎండీ, ఏపీఐఐసీ)లకు విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగయ్యే పరిస్థితి వస్తుంది. ఈ అదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా 3031కు పైగా స్టోర్స్‌ ఉన్నాయి, 25వేలకు పైగా మల్టీ బ్రాండ్‌ అవుట్‌లెట్స్, దాదాపుగా 6500 డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ కూడా ఆదిత్య బిర్లా గ్రూపు ఆపరేట్‌ చేస్తుంది. వ్యాన్‌ హ్యుసేన్, ఆలెన్‌ సోలీ వంటి బ్రాండ్లు అన్ని కూడా ఆదిత్య బిర్లా గ్రూపు నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 
 
 
2019–2020లో ఆదిత్య బిర్లా గ్రూపు రిటైల్‌ టర్నోవర్‌ రూ.8700 కోట్లు చేసి, 25 వేలకు పైగా ఉద్యోగాలు కూడా కల్పించింది. ఇందులో 85 శాతం ఉద్యోగాలు అక్కచెల్లెమ్మలకే ఇచ్చింది. అటువంటి మంచి సంస్ధ ఈరోజు ఇక్కడకు వస్తుంది. రూ.110 కోట్ల పెట్టుబడితో మొదటి దఫా కింద 2112 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దిశగా వీళ్లంతా అడుగులు వేస్తున్నార‌ని సీఎం తెలిపారు.