శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (15:33 IST)

జగన్ "రచ్చబండ"... ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'స్పందన'

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తున్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళుతూ మార్గమధ్యంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ దుర్మరణం పాలయ్యారు. 
 
ఇపుడు వైఎస్ తనయుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రభుత్వ పాలనలో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులోభాగంగా, రచ్చబండ కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు. 
 
అమరావతిలోని ప్రజావేదికలో సోమవారం 13 జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఇకపై ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆయన తెలిపారు. ఆ రోజున ఎలాంటి మీటింగ్‌లు పెట్టుకోవద్దని కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించారు. 
 
అంతేకాకుండా, స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కోరారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక రసీదు ఇచ్చిన.. ఫిర్యాదుదారుని మొబైల్ నంబరును తీసుకోవాలన్నారు. పైగా, ఫిర్యాదు సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో తెలియజేయాలని కోరారు. 
 
అలాగే, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు 'రచ్చబండ' కార్యక్రమాన్ని చేపడతానని సీఎం జగన్ ప్రకటించారు. ప్రజలకు అందుతున్న సేవలను తాను నేరుగా పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎం సూచించారు. 
 
కాగా, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 'రచ్చబండ' కార్యక్రమానికి 2009, సెప్టెంబరు 2వ తేదీన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శ్రీశైలం నల్లమల అడవుల్లోని పావురాల గుట్టవద్ద కూలిపోయింది. ఈ దుర్ఘటనలో వైఎస్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.