శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (08:57 IST)

కూతకి రెడీ : హైదరాబాద్ మెట్రోకు సేఫ్టీ సర్టిఫికేట్

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించడానికి రైల్వేశాఖకు చెందిన సేఫ్టీ కమిషన్ పచ్చజెండా ఊపింది.

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించడానికి రైల్వేశాఖకు చెందిన సేఫ్టీ కమిషన్ పచ్చజెండా ఊపింది. ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు మెట్రోలోని వివిధ విభాగాలను పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషన్... సివిల్ వర్క్, ట్రాక్, వయాడక్, స్టేషన్స్, విద్యుత్, సిగ్నల్స్, ట్రైన్ కంట్రోల్, టెలీ కమ్యూనికేషన్, రోలింగ్ స్టాక్ తోపాటు ఇతర రైల్వే సిస్టమ్ మొత్తాన్ని నిశితంగా తనిఖీ చేసి సేఫ్టీ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. ఈ మెట్రో రైల్ మార్గంలో ప్రతి ఒక్కటీ సక్రమంగానే ఉన్నాయనీ తెలుపుతూ ప్రయాణికుల కోసం సర్వీసులు ప్రారంభించుకోవచ్చని తెలిపింది.
 
ఇప్పటికే నాగోల్ టూ మెట్టగూడ, మియాపూర్ టూ ఎస్ఆర్ నగర్ ఎప్పుడో అనుమతి వచ్చింది. ఇప్పుడు మాత్రం నాగోల్ టూ మియాపూర్ వయా అమీర్‌పేట మీదుగా సర్వీసులు ప్రారంభించేందుకు సేఫ్టీ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో 30 కిలోమీటర్ల మొత్తం దూరానికి మెట్రో రైలు సిద్ధం అయ్యింది. 
 
ప్రస్తుతం అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ దగ్గర చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. మరికొన్ని రోజుల్లోనే వీటిని పూర్తి చేస్తామని మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెలాఖరులో హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.