బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (09:05 IST)

అంగన్‌వాడీ గుడ్ల బరువుపై నిరంతర తనిఖీ: ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 14408

అంగన్‌వాడీ సరుకుల పంపిణీలో సేవా లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పధకాల అమలులో లబ్ధిదారుల ఎదుర్కునే సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంచుకున్న‌ట్లు చెప్పారు.

ఉన్నత స్థాయిలో ప్రతి పక్షం రోజులకు ఒకసారి అంగన్‌వాడీ లబ్ధిదారులకు కనీసం పది కాల్స్ చేసి సమాచారం రాబట్టేలా వ్యవస్ధను అభివృద్ది చేసామన్నారు.

ముఖ్య కార్యదర్శి మొదలు, సంచాలకులు, అదనపు సంచాలకులు, ప్రాంతీయ అదనపు సంచాలకులు,  క్షేత్ర స్ధాయి అధికారులు గతనెల నుండే లబ్డిదారులకు నేరుగా ఫోన్ చేసి సమస్యలను గుర్తించే ప్రయత్నం చేసారని, ఇలా దాదాపు 15000 మంది లబ్దిదారులను సంప్రదించగా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని కృతికా శుక్లా వివరించారు. 

రాష్ట్రంలో అంగన్ వాడి కేంద్రాల పనితీరును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియల్ స్వయంగా ప్రశంసించారని, 50 గ్రాముల గుడ్డు సరఫరా విషయంలో పీడీలు, సీడీపీవోలు నిరంతరం తనిఖీలు చేస్తున్నారన్నారు.

ఎక్కడయినా సమస్యలు ఉంటే ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఇప్పటికే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 14408 అందుబాటులో ఉందన్నారు.  కేంద్రం ఇటీవల నిర్వహించిన పోషణాభియాన్ సర్వేలో కూడా రాష్ట్రంలో అంగన్ వాడి కేంద్రాలు నూటికి నూరు శాతం బాగా పనిచేస్తున్నాయన్న విషయం స్పష్టమైందని వివరించారు.

వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో  గుడ్ల సరఫరాకు సంబంధించి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్లు పిలవలేదని పాఠశాల విద్యా శాఖ ఖరారు చేసిన సరఫరాదారులే వాటిని అందిస్తున్నారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

గుడ్ల సరఫరాలో నాణ్యత, బరువు విషయంలో నిరంతర తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని, అంగన్వాడీ కార్మికులు గుడ్లు అంగీకరించే ముందు గుడ్ల బరువును తనిఖీ చేసి, తక్కువ బరువున్న గుడ్లు వెనక్కి పంపుతారని స్పష్టం చేసారు.  కరోనా కారణంగా లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పంపిణీని చేపట్టామని, ఏ ఒక్కరూ గుడ్డు బరువు విషయంలో ఫిర్యాదు చేయలేదన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు స్వీకరించేటప్పుడు ఇండెంట్ ప్రకారం అన్ని గుడ్లపై స్టాంప్ గుర్తించబడిందని ధృవీకరిస్తారని, నిర్ణీత రోజుల కలర్ కోడ్ ప్రకారం 10 రోజులలోపు గుడ్లను ఉపయోగించుకోవలసి ఉంటుందన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో రెండు రంగులకు పైగా గుడ్లు ఉండవని, గుడ్డు ట్రేల యాదృచ్చిక తనిఖీ నిరంతర ప్రక్రియగా అమలు చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

వివిధ పధకాలలో భాగంగా పోషకాహారంగా అందిస్తున్న గుడ్ల కోసం రూ.432.43 కోట్ల సాంవత్సరిక బడ్జెట్ వినియోగిస్తున్నామని, ఈ క్రమంలో 92.40 కోట్ల గుడ్లను 30.50 లక్షల మంది లబ్డిదారులకు చేరుతున్నాయని వివరించారు.

పాలిచ్చే తల్లులు, గర్బిణీ స్ర్తీలు 6,80 లక్షల మంది, మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులు 8.70 లక్షల మంది, ఏడు నెలల నుండి మూడేళ్లు వయస్సు కలిగిన చిన్నారులు 15 లక్షల  మంది ఈ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందుతున్నారని స్పష్టం చేశారు.