బెజవాడలో యువకులకు బెండు తీస్తున్నారు, ఎందుకంటే..?
లాఠీతో కొట్టారు..వినలేదు. గుంజీలు తీయించారు..పట్టించుకోలేదు. హెచ్చరించారు..బేఖాతరు చేశారు. వాహనాలను సీజ్ చేసి.. రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్నారు. దీంతో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత వల్లే ఇదంతా కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న విజయవాడ పోలీసులకు ఒక ఐడియా వచ్చింది.
కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాలతో డిసిపి విక్రాంత్ పాటిల్, ఎసీపీ సూర్యచంద్రరావు ప్రత్యేక బృందాలతో రోడ్లపైకి ఎక్కారు. అనవసరంగా తిరుగుతూ రోడ్లపైకి వచ్చేవారిని గమనించారు. అలాంటి వారిని ఆంబులెన్స్ లోకి ఎక్కించారు.
ఇలా ఎంతోమంది యువకులను ఆంబులెన్స్‌లో ఎక్కించి క్వారంటైన్‌కి పంపించడం ప్రారంభించారు. ఇది కాస్త బెజవాడ మొత్తం ప్రచారం జరిగింది. దీంతో యువకులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం నిర్మానుషమైన వాతావరణం విజయవాడలో కనిపిస్తోంది.