శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (18:23 IST)

కోవిడ్ బారిన పడిన కుటుంబాలకు ఫుడ్ రిలీఫ్ కిట్స్, కోవిడ్ కేర్ కిట్స్ పంపిణీ

కరోనా బాధిత చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు మంజూరు చేయగా, పిఎం కేర్ ఆర్దిక సహాయం కోసం అవసరమైన పక్రియను పూర్తి చేశామని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. కోవిడ్ వల్ల రాష్ట్రంలో 8,131 మంది పిల్లలు తల్లిదండ్రులలో ఎవరో ఒకరిని కోల్పోగా, 255 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం జరిగిందని వీరిని ఆదుకోవటానికి అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.
 
జాతీయ బాలల వారోత్సవ వేడుకలలో భాగంగా, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ గుంటూరు ప్రాంగణంలో కోవిడ్ బారిన పడిన కుటుంబాలకు ఫుడ్ రిలీఫ్ కిట్స్, పిల్లల సంరక్షణ సంస్థలకు కోవిడ్ కేర్ కిట్స్ పంపిణీ చేసారు. కార్యక్రమంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన కుటుంబాలకు కేర్ ఇండియా, కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ వంటి సంస్థలు అండగా నిలబడ్డాయని కొనియాడారు.
 
ఇప్పటికే 255 మంది పిల్లలలో 214 మంది పిల్లలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వటం జరిగిందన్నారు. కార్యక్రమంలో 3,000 కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 1,760 విలువగల 12 రకాలైన నిత్యావసర సరుకుల కిట్స్‌ను అందిస్తున్నామన్నారు. త్వరలోనే కోవిడ్ తో అనాథలైన 3,308 మంది పిల్లలకు ఎడ్యుకేషనల్ కిట్ కూడా అందిస్తామన్నారు.
 
మరోవైపు రాష్ట్రంలోని 112 పిల్లల సంరక్షణా సంస్థలకు ఒక్కొక్క సంస్థకు సుమారు రూ. 80,000 విలువైన కోవిడ్ కేర్ కిట్స్ అందించడంతోపాటు, పిల్లల సంరక్షణా సంస్థలలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూడా తెలియ జేసారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజని గారు, గుంటూరు జిల్లా డీసీపీవో విజయ్, కేర్ ఇండియా ప్రతినిధులు రోజా రాణి, నరసింహ మూర్తి, కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ ప్రతినిధులు తిరుపతి రావు, చంద్రశేఖర్, మహిళాశిశు సంక్షేమ శాఖ సిబ్బంది,  పాల్గొన్నారు.