పర్యావరణహిత సంబరాలశైలి...అసలైన దీపావళి: మంత్రి మేకపాటి
జ్ఞానమే వెలుగు..అజ్ఞానమే చీకటి. దీపం చిన్నదైనా తన చుట్టూ వెలుగు నింపుతుంది. అలాగే మనిషి కూడా తన మనుగడకు కారణమైన ప్రకృతిని, తన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవడంలో అసలైన సంతోషం దాగి ఉంది.
ఒక్క స్వార్థం లేని మంచి ఆలోచన నిలకడగా వెలుగుతున్న జ్యోతివంటిది. అది మరోదీపాన్ని వెలిగిస్తుంది. తన చుట్టూ ఉన్నవారికి వెలుగును ప్రసరింపజేస్తుంది. చీకటిని పారద్రోలి వెలుగులు తెచ్చే పండుగ. విజయానికి ప్రతీక. మతసామరస్యపు వీచిక. దీపాలను వరుసగా పెట్టడాన్ని 'దీపావళి'గా పిలుస్తాం.
దీపావళి అంటే దీపాలు ఇంటి ముందు అందంగా అలంకరించడమనే కాదు..సమాజమంతా సంతోషంగా ఉండాలని కోరుకోవడం. అందరూ ఐకమత్యంతో ఆనందోత్సాహాలతో గడపడం. సామాజిక స్పృహతో చేతనైనంత తోటివారికి సాయపడుతూ బ్రతకడం.
ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళిగా జరుపుకోవడం ఆనవాయితీ. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్నే నరక చతుర్దశిగా జరుపుకుంటాం. అందరికీ, అంతటికీ వెలుగులు అందించే పర్యావరణ దీపావళిపై రోజురోజుకీ అవగాహన పెరుగుతోంది.
ఇది మంచి పరిణామం. మనం పండుగ చేసుకుంటే పక్కనవాళ్లు కూడా సంతోషపడాలి. మనం పేల్చే పెద్ద పెద్ద శబ్దాలకు గుండెదడ పుట్టి భయపడకూడదు. విపరీతమైన గాలి కాలుష్యంతో రోగాలపాలు కాకూడదు.
ముఖ్యంగా ఇబ్బంది పడకూడదు. సామాజిక బాధ్యతతో సహజసిద్ధంగా, పర్యావరణహితంగా దీపావళి జరుపుకునే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు.