మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సుప్రీం చెంతకు గోదావరి బోటు మునక కేసు

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద పర్యాటక బోటు మునిగిపోయిన కేసు ఇపుడు సుప్రీంకోర్టు చెంతకు చేరింది. కచ్చులూరు పడవ ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆచూకీ లభించని మృతదేహాలను వెలికితీసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ విచారణలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
 
గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ పలు సందేహాలను లేవనెత్తారు. బోటు ప్రమాదంలో గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రభుత్వ వివరణతో విభేదిస్తూ.. బోటులో 93 మంది ప్రయాణించారని ఆరోపించారు. వరదను అంచనా వేస్తూ.. గోదావరిలోకి బోటు వెళ్లవద్దని దేవీపట్నం ఎస్ఐ వారించినా ఓ ఓ మంత్రి ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని ఆయన ఆరోపించారు. బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ప్రమాదం జరిగిన బోటులో కూడా అలానే జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
 
గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదంపై అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. దీంతో బోటులో అసలు ఎంత మంది ప్రయాణించారనే దానిపై వివాదం రాజుకుంది. అయితే బోటులో 93 మంది ఉన్నారని ఎలాంటి ఆధారాలతో చెప్తున్నారని హర్ష కుమార్‌‌కు పోలీసులు నోటీసులు పంపించారు. దీనిపై సమాధానమివ్వని హర్ష కుమార్‌ తాజాగా సుప్రీం తలుపు తట్టారు.