ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 మే 2021 (23:33 IST)

మార్కెట్‌కెళితే నష్టం- తోటవద్దే విక్రయం, కుదరకపోతే వదిలేస్తున్నారు

చిన్నమండెం: వేసవి టమాటకు ధరల్లేకపోవడంతో రైతులు డీలాపడ్డారు. ప్రస్తుతం జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట సాగులో ఉంది. దిగుబడులు అధికంగా వస్తున్నాయి. ధరలు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. దీంతో కాయలను మార్కెట్‌కు తరలిస్తే పైసా మిగలదని తోటల దగ్గరకు వస్తున్న వ్యాపారులకు విక్రయించేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు.
 
ఏ తోట చూసినా ఎర్రగా మాగిన టమాటలు గుత్తులుగా దర్శనమిస్తున్నాయి. గత్యంతరం లేక కొందరు రైతులు దళారులను ఆశ్రయించి ధరలు తక్కువైనా తోటల దగ్గరే విక్రయిస్తున్నారు. దీనివల్ల 30 కిలోల పెట్టె రూ.80 పలికితే రూ.40 మిగులుతుందని చెబుతున్నారు. అదే మార్కెట్‌కు తరలిస్తే కోత కూలి, రవాణా, కమీషన్ల వంటి ఖర్చులకే సరిపోతోంది అంటున్నారు.మొదటి రెండు కోతలకు మాత్రమే వ్యాపారులు తోటల దగ్గరకు వస్తున్నారు. ఆ పైన రాకపోవడంతో రైతులు తోటలను వదిలేస్తున్నారు.