సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (13:19 IST)

ఉద్యమం ప్రారంభమై 17వ తేదీకి నాలుగేళ్లు - బహిరంగ సభకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

amaravathi
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులపై అసెంబ్లీలో చేసిన ప్రకటనతో మొదలైన అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ రోజు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో భారీ సభను నిర్వహించనున్నారు. 
 
ఈ మైదానంలో 2014లో నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నందున.. అమరావతిపై జగన్‌ ప్రభుత్వ కుట్రలు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పరిరక్షణ సమితి నిర్ణయించింది. సభకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే గుంటూరు పోలీసులకు దరఖాస్తు చేశారు.
 
ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నట్లు తెలిసింది. పొత్తు ప్రకటన తర్వాత ఇద్దరు అగ్రనేతలూ ఒకే వేదిక మీదకు రానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అమరావతిని వ్యతిరేకిస్తున్న వైకాపా మినహా అన్ని పార్టీల నేతలు హాజరుకానున్నారు. 
 
ముఖ్యంగా, టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీల నేతలతో పాటు దళిత సంఘాలు, వివిధ కుల సంఘాల నేతలను కూడా అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆహ్వానించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికీ నేడో, రేపో ఆహ్వానం అందించనున్నారు.
 
ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ సభలో నేతల ప్రసంగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక అధ్యక్షుడు, విశ్రాంత డీఎస్పీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో రెండు ప్రత్యేక గీతాలను రూపొందిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో అమరావతి రైతుల పోరాటాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, కష్టాలు, పోలీసుల దమనకాండను కళ్లకు కట్టేలా పాటను రచించారు. 
 
జగన్‌ సర్కారును గద్దె దింపితేనే ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి రక్షణ అని సాగే మరో పాటను రూపొందించారు. రెండు గీతాలను చైతన్యవేదిక గాయకుడు రమణ బృందం ఆలపించింది. వీటిని ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. జగన్‌ ప్రభుత్వం అమరావతికి చేస్తున్న ద్రోహం... రాజధానిని కాపాడుకోవాల్సిన అవసరం, అభివృద్ధి చెందితే అందే ఫలాల గురించి ఓ లఘుచిత్రాన్ని ప్రదర్శించనున్నారు.