శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:43 IST)

4న రైతుసంఘం చలో అసెంబ్లీ

తడిసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని, విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యాన 4న చలో అసెంబ్లీ చేపట్టనున్నట్లు సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. నివర్‌ తుపాను వల్ల పంట కళ్లాలలోని, మార్కెట్‌యార్డులో ఉన్న ధాన్యం రాశులు నీట మునిగాయని తెలిపారు. కోతకు సిద్ధమై ఉన్న వరి పొలాలన్నీ నీట మునిగాయని పేర్కొన్నారు. రైతుకు అపార నష్టం కలిగిందని తెలిపారు.

ఇదే అదనుగా వరికోత యంత్రాల అద్దె గంటకు రూ.2 వేలు నుండి రూ.3వేలకు పెంచారని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.

తడిసిన ధాన్యాన్ని నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని, ఈక్రాప్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని, బకాయి ఉన్నా.. నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని, నష్టపరిహారం వరికి ఎకరాకు రూ.25వేలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు రూ.50వేలు ఇవ్వాలని, జిఒ 22 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులు తమ తడిసిన ధాన్యం, నీటి మునిగిన వరి పనలతో ఉండవల్లి సెంటరుకు 4న ఉదయం 10 గంటలకు రావాలని, అక్కడి నుండి చలో అసెంబ్లీ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.