బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (08:22 IST)

ఉల్లి కోసం.. రైతుకు మోసం

దళారులు, వ్యాపారుల మాయాజాలానికి ఉల్లిరైతు చితికిపోతున్నాడు. ఈసారైనా పంటకు గిట్టుబాటు ధర దక్కుతోందని ఆశపడ్డ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహారాష్ట్రలో ఉల్లిపంట దెబ్బతింది. దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కర్నూలు ఉల్లిగడ్డుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో క్వింటాల్‌ 4 వేల 500 రూపాయలు పలికింది. వరుసగా 3 ఏళ్లుగా నష్టాలను చవిచూసిన కర్నూలు ఉల్లిరైతులు… పెరిగిన ధరతో కాస్త సంతోషపడ్డారు.

అయితే దళారులు, వ్యాపారులు కుమ్మక్కై సిండికేట్‌గా ఏర్పడి..ధరలను అమాంతం తగ్గించారు. ఇప్పుడు క్వింటాల్ వెయ్యి నుంచి 15 వందలు మాత్రమే పలుకుతోంది. దీంతో ఉల్లిరైతులు కర్నూలు మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వారికి సర్ది చెప్పారు.
 
భారీ వర్షాల కారణంగా ఈసారి ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు రైతులు నుంచి భారీగా ఉల్లిగడ్డలుకొని వాటిని గోడౌన్లలో నిల్వచేశారు.

సరిపడినంత సరుకు ఉండటంతో రైతుకు చెల్లించే రేట్లు ఒక్కసారిగా తగ్గించారు. వీరికి దళారులు కూడా తోడయ్యారు. క్వింటాల్ వెయ్యి నుంచి 15 వందలకు ఇస్తే ఇవ్వండి లేదంటే వెళ్లిపోండి అంటూ తెగేసి చెబుతున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు ఉల్లి రైతులు.
 
రైతుల నుంచి కిలో ఉల్లిని 10 నుంచి 15 రూపాయలకు కొంటున్న వ్యాపారులు.. వినియోగదారులకు మాత్రం 60 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే 50 రూపాయల లాభం తీసుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు మాత్రం గిట్టుబాటు ధర కూడా రాక అప్పుల పాలవుతున్నాడు. మధ్యలో దళారులు మాత్రం కోట్లు వెనకేస్తున్నారు. ఈ దోపిడీకి ఇప్పటికైనా చెక్‌పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
 
 
ఉల్లిపాయలు దొంగ.. యజమాని కన్నీళ్లు
అయ్యో.. మా ఆవిడ మెళ్లో గొలుసో.. నా చేతి రింగో పట్టుకుపోయాడు కాదు దొంగ వెధవ.. గోడౌన్లో ఉల్లి పాయలన్నీ దోచుకు పోయాడు.. అని లబో దిబో మంటున్నాడు బీహార్ రాజధానికి పాట్నాకు చెందిన వ్యక్తి.

అసలే కిలో రూ.80 లు చెబుతున్నారు మార్కెట్లో. గోడౌన్ నిండా సరుకుంది. ఇంకా పెరిగేలా ఉందని మార్కెట్‌కి తక్కువ మొత్తంలో తరలిస్తున్నాడు. ఒకటి రెండు కాదు.. మొత్తం 8 లక్షల రూపాయల సరుకుంది. తక్కువ రేటు ఉన్నప్పుడు కొని గోడౌన్‌లో దాచుకుంటే దొంగ వెధవ కన్ను పడనే పడింది.

తెల్లారిపాటికి శుభ్రంగా సరుకు మొత్తం ఖాళీ చేసాడు. పగలు నలుగురు వ్యక్తులు వచ్చి మొత్తం పరికించారు. రేటు మాట్లాడుకున్నారు. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు. అంతే ఇలా అర్థరాత్రి వచ్చి దోచుకుపోతారని అస్సలు ఊహించలేదు.

ఉన్న ఇద్దరు నైట్ వాచ్‌మెన్‌లు చెట్టుకి కట్టేసి సరుకంతా ట్రక్కుల్లో తరలిచేశారని కన్నీళ్లొత్తుకుంటున్నాడు ఉల్లిపాయల వ్యాపారి. పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకున్నారు. గోడౌన్‌కు వచ్చి పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.