శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 10 జూన్ 2020 (22:38 IST)

కీచక ఎస్సైపై సస్పెన్షన్ వేటు, పరారీలో వున్న ఎస్సై

అమరావతిలో మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన ఎస్సై రామాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై ఎస్సై వేధింపులకు పాల్పడ్డారని మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులో తీసుకుంటారన్న భయంతో పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు.
 
ఈ కేసు వివరాల్లోకి వెళితే... అమరావతిలోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో పెదకూరపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక జంట గది అద్దెకు తీసుకుంది. ఈ విషయాన్ని అదే వీధిలో వేరే అతిథి గృహంలో వున్న ఎస్ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ గమనించారు. వెంటనే ఇద్దరూ వెళ్లి ఆ గదిలో పోలీసు రైడ్ అంటూ బెదిరించారు.
 
 తమకు రూ. 10వేలు ఇవ్వాంటూ డిమాండ్ చేయడంతో సదరు యువకుడు రూ. 5 వేలు ఇస్తానని అంగీకరించాడు. తనవద్ద వున్న రూ.3 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.2 వేలు సమీపంలోని ఏటీఎం నుంచి డ్రా చేసి ఇస్తానన్నాడు. దాంతో ఆ యువకుడి వెంట తన డ్రైవరును ఇచ్చి పంపిన ఎస్ఐ గదిలో ఒంటరిగా వున్న యువతిపై కన్నేశాడు.
 
తన కోర్కె తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె అందుకు తిరస్కరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్న సమయంలో ఏటీఎం నుంచి నగదు డ్రా చేసుకుని యువకుడు తిరిగి వచ్చాడు. దీనితో డబ్బు తీసుకుని ఆ జంటను వదిలేశారు. తనపై జరిగిన వేధింపులను పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎస్సైని సస్పెండ్ చేశారు.