శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (21:00 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో 90 శాతం తగ్గిన హెల్త్ కేర్ ఖర్చు...

అమరావతి: గత మూడేళ్ల నుంచి రాష్ట్రం వైద్య రంగంలో ప్రవేశపెట్టిన వినూత్న పథకాల వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడమే కాకుండా... హెల్త్‌కేర్ కోసం వారు చేస్తున్న ఖర్చు 90 శాతం మేర తగ్గిందని సెర్ప్-ఎస్హెచ్జీల సర్వేలో వెల్లడైంది. దీంతో రాష్ట్రంలోని వైద్యరంగంలో అమలుచేస్తున్న వివిధ రకాల వైద్యసేవ పథకాలపై నీతిఆయోగ్ ఆసక్తి కనబరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి వల్ల ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గడంపై నీతి ఆయోగ్ ఆరా తీస్తోంది. ఈ మేరకు ఒక వివరణాత్మక నోట్ తయారుచేసి పంపాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖను కోరింది.
 
ప్రభుత్వం అమలుచేస్తున్న కొత్త కొత్త వైద్య పథకాలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి... వైద్యం కోసం ప్రజలు పెట్టే ఖర్చులు ఎంత మేర తగ్గాయనే అంశంపై గత మూడేళ్ల నుంచి ప్రతి ఏడాది ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ ఎకౌంటెంట్స్ నిబంధనల ప్రకారం సెర్ప్, ఎస్హెచ్జీ గ్రూపులతో సర్వే చేయిస్తోంది. 2015లో బేస్లైన్ సర్వే చేశారు. ఆ తర్వాత 2017, 2018లో కూడా ఈ సర్వే చేశారు. 2015లో హెల్త్కేర్ సేవల కోసం రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి సగటున రూ.5770 ఖర్చు చేస్తున్నాడని సర్వేలో వెల్లడించారు. ఇందులో మందుల కోసం రూ.5062, ల్యాబ్లో పరీక్షల కోసం రూ.860, ఇతర కన్స్యూమబుల్స్ కోసం రూ.2531 ఖర్చు చేస్తున్నట్టు 2015 సర్వేలో వెల్లడించారు. 
 
2017లో నిర్వహించిన సర్వే ప్రకారం... ఒక్కో వ్యక్తి వైద్యం కోసం తన జేబు నుంచి రూ.1205 ఖర్చు చేస్తుండగా ఇందులో మందుల కోసం రూ.1104  ల్యాబ్లో పరీక్షల కోసం రూ.388, ఇతర కన్స్యూమబుల్స్ కోసం రూ.486 ఖర్చు చేశారు. 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం... హెల్త్కేర్ సేవల కోసం ఒక్కో వ్యక్తి చేసే ఖర్చు సగటున రూ.587కి తగ్గింది. మందుల ఖర్చు రూ.336కి, ల్యాబ్‌లో పరీక్షల ఖర్చు రూ.80కి, ఇతర కన్స్యూమబుల్స్  ఖర్చు రూ.135కి తగ్గింది. సెర్ప్ సహకారంతో ఎస్హెచ్జీలు చేసిన సర్వే ప్రకారం 2015లో రాష్ట్రంలో ఒక వ్యక్తి సగటున వైద్యం కోసం పెట్టిన ఖర్చు 2018 నాటికి 90 శాతం మేర తగ్గింది. 
 
మందుల ఖర్చు 93 శాతం మేర, ల్యాబ్లో పరీక్షల ఖర్చు 91 శాతం మేర, ఇతర కన్స్యూమబుల్స్ ఖర్చు 95 శాతం మేర తగ్గింది. ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన మొత్తం రూ.25,000 కోట్లు ఆదా అయిందని ఆ సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఈ మొత్తం వివరాలతో వైద్య ఆరోగ్య శాఖ ఒక నోట్ తయారుచేసి కేంద్ర ఆరోగ్య శాఖకు పంపుతోంది. అక్కడ నుంచి ఆ నోట్ నీతి ఆయోగ్‌కు వెళ్తుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.