పంట నష్ట వివరాల సేకరణలో జరిగిన లోపాలపై వ్యవసాయ శాఖ అధికారులుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడపలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో వ్యవసాయశాఖా ధికారులుతో నిర్వహించిన సమావేశంలో రాయచోటి నియోజక వర్గ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు పనితీరుపై ఆయన మండిపడ్డారు.
అన్నదాతలుగా పేరొందిన రైతుల కష్టాలకడలిలో తానున్నంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముందుకు వచ్చి ఉదాసీనతగా ఆదుకుంటున్నారన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులందరికీ మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోపే పరిహారం అందించారన్నారు.
కోరినన్ని వేరుశనగ విత్తనపు కాయలును అందించారన్నారు. మామిడి పంట దెబ్బతింటే పరిహారంకూడా ఇచ్చారన్నారు.రైతులకు మేలు జరిగే విషయాలలో అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నవంబర్ నెలలో తానూ సీడ్స్ ఎం డి తో రాయచోటి నియోజకవర్గానికి అవసరమైన 17 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలును మంజూరు చేయించాలని కోరగా వారు స్పందించి 17 వేల క్వింటాళ్లను సరఫరా చేశారన్నారు.
అయితే ఇక్కడ మీరు సైట్ ఓపెన్ కాలేదంటూ విత్తనపు కాయలు పంపిణీ చేయలేదని, గోడౌన్ లలో నిల్వలు అలాగే పెట్టేసారని, కొద్దిశాతం జరిగిన విత్తన పంపిణీలో కూడా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని ఆయన వారిపై మండిపడ్డారు.ఈ అంశంపై వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఇది రైతుల ప్రభుత్వమని, అధికారులుకు ఎంత చెప్పినా మీలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు.ముఖ్యమంత్రి జగన్ రైతుల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తుంటే క్షేత్ర స్థాయిలో అధికారులు చేస్తున్న తప్పులు క్షమించరాని నేరమన్నారు.రైతులకు చెందాల్సిన విత్తనపు కాయలలో అవినీతికి పాల్పడ్డవారిపై ఎర్రచందనం అక్రమ రవాణాలో పెడుతున్న పి డి యాక్ట్ కంటే కఠిన శిక్షలను అమలు చేయాలని, అవినీతిలో బాగస్వాములైన ఉద్యోగులను అయితే సస్పెండ్ చేయడం, దళారులను అయితే కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు.
తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోపే ఇన్ పుట్ సబ్సిడీని ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటిగా రాయచోటి నియోజక వర్గానికి రూ 8 కోట్లు విడుదల అయ్యాయన్నారు. అధికారులు, సిబ్బంది కొన్ని చోట్ల క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయక పంటలు నష్టపోయిన రైతుల వివరాలును నమోదు చేయలేదన్న పిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, పంట నష్టం జరిగిన రైతుకు న్యాయం చేయాలన్న ఆలోచన మీమదిలో లేకపోవడం దారుణమన్నారు.
ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని వ్యవసాయ శాఖ జె డి ని కోరామన్నారు. రాబోవు రోజుల్లో వ్యవసాయం, రెవెన్యూ, విద్య, వైద్య తదితర అంశాలలో సామాన్యుడికి అన్యాయం జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్టం రావాలన్నారు.ఇటువంటి తప్పిదాలనును భవిష్యత్తులో చేయకుండా లోపాలను సరిదిద్దుకోకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
వేరుశనగ విత్తనపు కాయల పంపిణీని త్వరితగతిన పంపిణీని పూర్తి చేయాలని ఎన్నో మార్లు మీకు చెప్పానని ఆయన గుర్తుచేశారు.గోడౌన్ లలో ఉన్న నిల్వలను వేరుశనగ పంట వేసుకునే రైతులందరికీ రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.రైతుల విషయాలలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిపై నిజాలు నిరూపణ అయితే పి డి యాక్ట్ పెట్టాలని జిల్లా ఎస్ పి ని కోరుతామన్నారు.
ఆరుగాలం కష్టించే రైతన్నకు అందరమూ తోడుగా వుందామని ఆయన హితవుపలికారు. రైతన్న విషయంలో ఏ చిన్నతప్పు చేయొద్దని శ్రీకాంత్ రెడ్డి అధికారులును ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ఏ డి ఏ లు సావిత్రి,మురళీధర్ రెడ్డి, నియోజక వర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు , మాజీ జెడ్ పి టి సి లు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.