గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:50 IST)

అత్యున్నత పౌరసేవకు వారధి ఐఎఎస్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయవలసిన అతి పెద్ద బాద్యత అఖిల భారత సర్వీసుల అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

ఐఎఎస్ అధికారిగా పని చేయటం అంటే అత్యున్నత పౌరసేవకు అవకాశం పొందినట్లు భావించాలని, ప్రజా సమస్యలను సానుకూల దృక్పధంతో పరిశీల‌న చేసిన‌ప్పుడే పరిష్కారం లభిస్తుంద‌ని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడి, రాష్ట్ర సచివాలయంలో శిక్షణ పొందుతున్న ఐఎఎస్ అధికారులు సోమవారం రాజ్ భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ముస్సోరీలో వీరు తీసుకోవాల్సిన రెండో ద‌శ తప్పనిసరి శిక్షణా కార్యక్రమం వాయిదా పడింది.

ఈ క్రమంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని వివిధ విభాగాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా  వీరు ప్రజా పరిపాలనలోని విభిన్న స్ధితి గతులను, సూక్ష్మ నైపుణ్యాలను తెలుసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. 

గవర్నర్ బిశ్వభూషణ్  హరిచందన్ ట్రైనీ ఐఎఎస్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని, వారు తమ విధుల నిర్వహణలో మార్గదర్శక శక్తిగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ప్రజా పరిపాలనలో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని అన్నారు.

జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి, సాంఘిక సమానత్వం, మత సామరస్యం, సమతుల్ ప్రాంతీయ అభివృద్ధి సాధనకు సివిల్ సర్వీస్ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అనంతరం వీరు సీనియర్ ఐఎఎస్ అధికారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనాను ప్రత్యేకంగా కలిసి విభిన్న అంశాలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో శిక్షణ ఐఎఎస్‌లు అనుపమ అంజలి, ప్రతిష్ట మమగైన్, హిమాన్హు కౌశిక్, కల్పనాకుమారి, సూరజ్ డిజి, వైదిఖేర్, నుపర్ ఎకె శివాస్, మౌర్య నారపురెడ్డి, ఇమ్మడి పృధ్వీ తేజ్, ఖేతన్ ఘర్గ్, భార్గవ్ టి అమిలినేని, జాహ్నవి ఉన్నారు.