భారతీయ న్యాయవ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం : ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నేలపాడులో గురువారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా ఆ త్యాగధనులను తప్పనిసరిగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచంలోనే భారతీయ న్యాయవ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. కేసుల పరిష్కారంలో భాగంగా శనివారం కూడా లీగల్ సెల్లో న్యాయవాదులు, సిబ్బంది బాధ్యతలను నిర్వహించడం వారి నిబద్ధతతను చాటుతుందన్నారు. సౌకర్యాల లేమి ఉన్నా వాటిని అధిగమించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. సంస్థకు మీరే బలమని సమస్యలను ఎదుర్కొని సమర్థవంతంగా అధిగమించడం ద్వారా విజయం సాధించగలుగుతామన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి ప్రతి ఒక్కరం కలిసి అడుగులు వేద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వైవి రవి ప్రసాద్, ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యంలు ప్రసంగించారు. ఈ వేడుకల్లో పలువురు హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, రాజధాని రైతులు, తదితరులు పాల్గొన్నారు. తొలుత పతాకావిష్కరణ ప్రాంగణానికి చేరుకున్న ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.