Instagram love story: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. అయినా ఇన్‌స్టాలో మరొకరితో లవ్ (video)
ప్రేమ పెళ్లిళ్లు పెటాకులు అవుతున్న సంగతి తెలిసిందే. ఒకరితో పెళ్లయ్యాక కూడా మరొకరితో ప్రేమ అంటూ అక్రమ బంధాల వైపు వెళ్తూ కొందరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందినదే ఓ వివాహిత, యువకుడి ఇన్‌స్టాగ్రామ్ లవ్ స్టోరీ. చివరికి మహిళ భర్తకు వ్యవహారం తెలియడంతో ఆమె ప్రియుడ్ని పట్టుకుని చితకబాది బుద్ధి చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్రశేఖర్ (20), కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఇన్‌స్టాగ్రాంలో మదనపల్లె మండలం సీటీఎంకు చెందిన ఓ మహిళ పరిచయమైంది. అప్పటికే ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు పిల్లలు సైతం ఉన్నారు. కానీ ఆమె భర్తను మోసం చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ద్వారా గాఢంగా ప్రేమించారు. ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో కొన్నాళ్లు వ్యహహారం బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల కిందట ఆమెపై భర్తకు అనుమానం వచ్చింది. స్మార్ట్‌ఫోన్లో ఏం చేస్తుందా అని గమనించిన ఆమె భర్తకు దిమ్మదిరిగే విషయం తెలిసింది.
తన భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తోందని.. అతడి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పసిగట్టాడు. తన భార్యను దారిలో పెట్టాలని భావించాడు. అదే సమయంలో భార్య లవర్‌కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు.
పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్న ఇంద్రశేఖర్‌ను పట్టుకుని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ప్రియుడి వివరాలు రాబట్టాడు. యువకుడు మెస్సేజ్ చేయడంతో శనివారం రాత్రి తన భార్య బయటకు వెళ్లడం గమనించాడు.
కొందరు సన్నిహితులు, స్నేహితులతో వెళ్లి ఇంద్రశేఖర్, తన భార్య చెట్టు కింద కూర్చుని మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని చితకబాదారు.
భార్య ఎదుటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ లవర్‌ను పట్టుకుని దాడిచేశారు. వివాహిత భర్త, ఆమె బంధువుల దాడిలో గాయపడ్డ ఇంద్రశేఖర్ స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది.