సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: శనివారం, 4 ఆగస్టు 2018 (17:42 IST)

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి...

ఈమధ్య సామాజిక మాధ్యమాలలో గొడవర్తి పద్మావతి గారి వీడియో బహుళ ప్రచారంలో ఉన్నది. సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలలో అసత్యాలకు కూడా అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని పలువురితో నిర్ధారించుకున్న తరువాత ఈ అంశాన్ని తమరి దృష్టికి తెస్తున్నాను. ఈవిడ భర్త కొంతకాలం క్

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి... 
విషయం: గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రు గ్రామం వాస్తవ్యురాలు గొడవర్తి పద్మావతి గారి భూ సమస్య తమరి దృష్టికి రానిచో తీసుకొచ్చే ప్రయత్నం.

 
ఈమధ్య సామాజిక మాధ్యమాలలో గొడవర్తి పద్మావతి గారి వీడియో బహుళ ప్రచారంలో ఉన్నది. సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలలో అసత్యాలకు కూడా అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని పలువురితో నిర్ధారించుకున్న తరువాత ఈ అంశాన్ని తమరి దృష్టికి తెస్తున్నాను. ఈవిడ భర్త కొంతకాలం క్రితం కాలం చేశారు. నలుగురు ఆడపిల్లలతో పిత్రార్జితమైన భూమిని కాపాడుకుంటూ జీవనం గడుపుతున్నది. దానిలో కొంత భాగం ఆమె భర్త స్వార్జితం అని దానికి ఎవరికో జీపీఏ ఇచ్చారని ఈమె భూమిని కబ్జా చేయడానికి ఒక ప్రణాళిక రచించినట్లుగా అర్థమవుతున్నది. 
 
ఆమె భర్త గ్రామంలో అప్పులు చేశారని ఒక ప్రక్క చెపుతూ మరి ఒకపక్క అతనికి స్వార్జితమైన భూమి ఉంది అనటం విచిత్రంగా ఉంది. ఈ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఉన్న భూములను అమ్ముకోవటం చూశాను కానీ స్వార్జిత భూములను గ్రామాలలో సంపాదించడం ఎక్కడా వినలేదు. 
ఏడుపదుల స్త్రీ ఇంకెవరినో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిందని క్రిమినల్ కేసు పెట్టి జైలులో పెట్టడం ఆవిడ పెళ్ళికాని కుమార్తెలను రోజు పోలీస్ స్టేషనుకు వచ్చి హాజరు కావాలనడం బట్టి చూస్తే పోలీస్ వ్యవస్థను స్థానిక రాజకీయ వ్యవస్థ ఎంత విశృంఖలంగా దుర్వినియోగం చేస్తూ ఉందో అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నదని నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం. 
 
ఒక ఒంటరి మహిళ అయి ఉండి కలుషితమైన వ్యవస్థకు ఎదురు నిలిచి ఆమె తన హక్కులకై పోరాడుతున్న తీరు అభినందనీయం. 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో స్థానిక అధికార పార్టీ నాయకుల అండతో బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తిని కబ్జా యత్నం చేసినప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆనాడు స్థానిక పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేసి వారి ఆస్తులను కాపాడగలిగాము. ఈ సామాజికవర్గాలకు చెందిన భూములు కబ్జాదారులకు కబ్జాకు ఆకర్షణీయంగా ఉంటాయి(soft targets). ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణ కార్పొరేషన్లో భూ పరిరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిలో ఒక విశ్రాంత పోలీస్ రెవెన్యూ అధికారులను ఒక న్యాయపరమైన సలహాదారుని పెట్టటం జరిగింది. ఇటువంటి కేసులలో తప్పక కార్పొరేషన్ చొరవ తీసుకొని ఆమెకు అండగా నిలిచి ఉండాల్సింది. 
 
 
శాతవాహన కళాశాల అంశంలో ఒక ప్రముఖ నాయకుడి పాత్ర తమరికి తెలియనిది కాదు. 
సహజంగా సౌమ్య మనస్కులైన బ్రాహ్మణ వైశ్య సామాజికవర్గాలకు చెందిన భూములపై కబ్జాదారుల గురి ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి ఆస్తిపాస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది. దీనికి భిన్నంగా కంచే చేను మేసిన విధంగా పోలీస్ వ్యవస్థ కబ్జాదారులకు వత్తాసు పలికితే ఇక ప్రజలు చేయగలిగింది ఏమీ ఉండదు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తమరు పరిష్కరిస్తారని దీర్ఘకాలంలో ఈ పై రెండు సామాజిక వర్గాల ఆస్తిపాస్తుల పరిరక్షణకు తగిన విధివిధానాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. 
ఇట్లు భవదీయుడు, 
 
ఐవైఆర్ కృష్ణారావు.