శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (08:04 IST)

జగన్‌ వి చిల్లర రౌడీ రాజకీయాలు..చంద్రబాబు

వైసీపీ పార్టీది వైసీపీది చిల్లర, రౌడీ రాజకీయమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లను ప్రభుత్వం నిర్వహించి రూ.5 కే పేదలకు భోజనం పెడితే, వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి మద్యం దుకాణాలు నడుపుతోందని ఎద్దేవా చేశారు.

‘ఒక్క అవకాశం ఇవ్వండంటూ గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్‌రెడ్డి.. చిల్లర రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని చంద్రబాబు హెచ్చరించారు.

అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీకి గట్టిపునాది వేశారని.. ఇది తెలుగు జాతి ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. ఖజానాలో డబ్బుల్లేవని చెబుతూనే.. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.

శ్రీకాకుళం జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు చంద్రబాబు సభాముఖంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ఎనలేనివని కొనియాడారు.

పోలీసు వ్యవస్థ అంటే టీడీపీకి ఎనలేని గౌరవం ఉందని, అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అనంతరం కార్యకర్తలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే..
 
‘కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పినా.., ప్రజలు తెలిసో, తెలియకో జగన్‌కు ఓట్లేసి మోసపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేశామని మధనపడుతున్నారు. మళ్లీ నేనే రావాలని వారు కోరుకుంటున్నారు.

ఒక్క అవకాశం ఇస్తే ఏదో చేస్తాడని నమ్మి ప్రజలు ఓట్లేస్తే.. ఇచ్చిన హామీలను సైతం అమలుచేయకుండా నవరత్నాలను నవగ్రహాలుగా మార్చారు. ప్రజలు నవగ్రహాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. సంపద సృష్టించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించగలిగే సామర్థ్యం జగన్‌కు లేవు. టీడీపీకి వెన్నెముక వంటి కార్యకర్తలను వైసీపీ తప్పడు కేసులు బనాయిఽస్తే, చూస్తూ ఊరుకోం.

అవసరమైతే ప్రాణాలు అర్పించైనా న్యాయ పోరాటం చేస్తా. గత ఐదేళ్లలో మేం తలచుకుంటే ఒక్క వైసీపీ కార్యకర్త అయినా ఉండేవాడా? ఖబడ్దార్‌ జగన్మోహన్‌రెడ్డీ.. పులివెందుల పంచాయతీల మాదిరిగా తోక జాడిస్తే.. కత్తిరిస్తాం. జగన్‌కు శాడిస్టు అనే పదం చాలదు. జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటే పోలీసులు కేసులు పెడుతున్నారు.

నడిరోడ్డుపై నన్ను ఉరితీయాలన్న జగన్‌ వ్యాఖ్యలు పోలీసులకు వినపడలేదా? ఇల్లు అలకగానే పండగ కాదు.. ముందుంది మొసళ్ల పండగ. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి ఇదేమైనా వారి అబ్బసొత్తా? అఖిలప్రియ ఇంటిలో సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తనిఖీలు చేశారు.

కోడెలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసి చంపేశారు. వైసీపీ వేధింపులకు ప్రాణాలు పోతుంటే ప్రశ్నించడం తప్పా? డీజీపీ స్థాయి అధికారి షో చేస్తున్నామనడం సరైన పద్ధతేనా? జగన్‌కు అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి. వైఎస్‌ వివేకా హత్య గురించి మాట్లాడకూడదట. 14 ఏళ్లు సీఎంగా చేసిన నాకు డీజీపీ చట్టాల గురించి చెబుతున్నారు.’
 
‘సంపద సృష్టించే అమరావతిలో ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. పేదోడికి కేవలం రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీను’ మూసి వేయడం అన్యాయం. ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తే విమర్శలకు దిగిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటి?

రాష్ట్రంలో పేదలకు ఇసుక దొరకదు కానీ.. అక్రమ రవాణాతో రాష్ట్రం దాటించేస్తున్నారు. బంగారమైనా కొనుగోలు చేయొచ్చేమో గానీ, ఇసుక కొనలేని పరిస్థితి తెచ్చారు. భవన నిర్మాణ కార్మికులు పనిలేక పస్తులు ఉంటున్నారు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. కౌలు రైతులను అవమానిస్తున్నారు. రుణమాఫీ రద్దు ఎంతవరకు సమంజసం?’
 
‘మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పి, అధికారులతోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. వైసీపీ నాయకులతో ఇంటింటికీ బెల్ట్‌ దుకాణాలు నడుపుతున్నారు. మద్యం అమ్మకాలు, బెల్టు షాపులతో జే ట్యాక్స్‌ విధిస్తున్నారు.

పోలవరం పనులు 71 శాతం పూర్తిచేస్తే, రివర్స్‌ టెండర్ల పేరుతో రిజర్వు టెండర్లు పిలిచారు. కావలసిన సంస్థకు పనులు అప్పగించారు.’
 
‘గ్రామ సచివాలయ పోస్టులు వైసీపీ కార్యకర్తలకే వచ్చాయి. పేపర్‌ టైప్‌ చేసిన మహిళకే మొదటి ర్యాంకు వస్తే దాన్ని కూడా సమర్థించుకుంటారా? ఐఏఎస్‌ పాస్‌ అయిన వ్యక్తి సచివాలయ ఉద్యోగానికి సెలక్ట్‌ కాకపోగా వైసీపీ కార్యకర్తలు మాత్రం ర్యాంకులు సాధించడం విడ్డూరం.

లక్షల మంది వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించుకుని నెలకు రూ.8 వేలు ఎవడబ్బ సొమ్మని ఇస్తారు? గతంలో మైనింగ్‌ మాఫియాకు గనులు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి రూ.43 వేల కోట్ల అవినీతిలో భాగస్వాములను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు.

నాపై జగన్‌ తండ్రి 26 కేసులు వేసినా ఏమీ సాధించలేకపోయారు. తప్పు చేయని వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. మీడియా స్వేచ్ఛను వైసీపీ నాయకులు హరిస్తున్నారు. తునిలో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి సత్యనారాయణను దారుణంగా చంపేశారు. పత్రికలు వార్తలు రాయకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. ప్రశ్నించే టీడీపీ నాయకులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారు.

వైసీపీ నాయకుల తప్పిదాలను మీడియాలో చూపితే అరెస్టు చేసేందుకు జీవో విడుదల చేశారు. ‘ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేయడంలోనే ఎక్కువగా గడిపా. దీంతో కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను.

ఇక నుంచి సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం మీతోనే గడుపుతా. యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులు ఇస్తాం. టీడీపీ నుంచి కొందరు నాయకులు బయటకు వెళ్లినంత మాత్రాన ఎటువంటి నష్టం లేదు. ఒకరు వెళ్తే వందమంది నాయకులు పుడతారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ చిరస్థాయిగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.