మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

భ‌వ‌న నిర్మాణ కార్మికులకు జనసేనాని అండ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగం కుదేలై ఉపాధి లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న కార్మికుల బాధలను అందరికీ తెలియచేసి, కార్మికులకు అండగా నిలిచేందుకు జనసేన అధ్యక్షుడు వన్ కళ్యాణ్ భారీ పాదయాత్ర (లాంగ్ మార్చ్) చేపట్టాలని నిర్ణయించారు.

నవంబర్ 3, 4 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్ర మొదలవుతుంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యులు తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు), కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డా.పసుపులేటి హరిప్రసాద్, సిహెచ్ మునుక్రాంత్ రెడ్డి, ఎ.భరత్ భూషణ్, బి.నాయకర్ సమావేశంలో పాల్గొన్నారు.

శుక్రవారం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్ధేందుకు పార్టీపరంగా నిరంతర కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని... అందులో భాగంగా క్షేత్ర స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేయాలని స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులు, విధులు, బాధ్యతలను యువతరానికి తెలియచేయడం ద్వారా దేశసమగ్రతను కాపాడగలమన్నారు. అలాగే కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
 
ప్రభుత్వానికి ఒక విధానం ఏది?
ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరంగా, రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి పాలనాపరంగా విధానం లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు... పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

ఇసుక కొరత, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, ఎన్నికల హామీల అమలులో వెనకడుగు, లోపభూయిష్టమైన మద్యం విధానం అంశాలు చర్చకు వచ్చాయి.
 
 
కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి: పవన్ కళ్యాణ్
"ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా లేకపోవడంతో 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమైపోయి తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైంది.

అక్కడకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దొరకడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ రంగం చుట్టూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి ఉపాధి ఉంది. వీళ్లంతా రోడ్డునపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేద్దాం.

ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం రావాలి" అన్నారు. విశాఖలో చేపట్టే భారీ పాదయాత్ర కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతను తోట చంద్ర శేఖర్ కు అప్పగించారు.
 
స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి
రాబోయే స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చించారు.

కమిటీల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, పార్టీ కమిటీల నిర్మాణంలో స్వల్ప మార్పులు చేయాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ అంశంపై సబ్ కమిటీని నియమించారు. సబ్ కమిటీ చర్చించి ఈ నెల 24 న పార్టీ అధ్యక్షులకు నివేదిక ఇస్తుంది. 

కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో జనసేన నాయకులూ, శ్రేణులపై రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని సభ్యులు ప్రస్తావించారు. అక్రమ కేసులు దాఖలు చేస్తూ కక్ష సాధించడం ప్రజాస్వామిక ధోరణి కాదని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఇలాంటి దాడులతో పార్టీ శ్రేణులను, నాయకులను భయపెట్టాలని పాలక వర్గమే భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు. శ్రేణులు, నాయకుల్లో మనోస్థైర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ రాజకీయ దాడులను ఖండిస్తూ కమిటీ తీర్మానం చేసింది.
 
అవి వైసీపీ దుకాణాలు 
లోపభూయిష్టమైన మద్యం విధానంతో మద్య నిషేధం ఏ విధంగా సాధ్యమని జనసేన పార్టీ తొలి నుంచి ప్రశ్నిస్తున్న విషయాన్ని సభ్యులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వం దుకాణాలు నిర్వహించడం ద్వారా అమ్మకాలు తగ్గుతాయని పాలక పక్షం చెబుతున్న మాటలు ఎంత మాత్రం నిజం కావని వస్తున్న ఆదాయం, పెరిగిన అమ్మకాలు చెబుతున్నాయి అని సభ్యులు సమావేశంలో చెప్పారు.

దుకాణాలు పెట్టిన జాగా, అందులో ఉద్యోగాలు... అన్నీ వైసీపీ వర్గానికి చెందినవారివే అని - అవి ప్రభుత్వ మద్యం దుకాణాలు కావనీ వైసీపీ మద్యం దుకాణాలు అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
 
సీపీఎస్ రద్దుపై వెనకడుగు
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని చెప్పి - ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించిన అంశంపై సమావేశంలో చర్చించారు. సీపీఎస్ రద్దు విషయంలో వైసీపీ వెనకడుగు వేసి, ఉద్యోగ వర్గాలను వంచించింది అని రాజకీయ వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది.
 
తెలంగాణ ప్రభుత్వాన్ని తలదన్నిన ఏపీ ప్రభుత్వం
అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్యల వాళ్ళ సుమారు రెండున్నర లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి నెలకొందని సభ్యులు ప్రస్తావించారు.

"48 వేలమంది ఆర్టీసీ కార్మికులను  తొలగించాలని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా అంతకు అయిదింతలు.. 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేలా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద"ని  పవన్ కల్యాణ్ విమర్శించారు. రెగ్యులరైజ్  చేయమని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం సరికాదన్నారు.
 
23 , 24 తేదీల్లో విజయవాడలో సమావేశాలు 
ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ నెల 23 వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు, ఈ నెల 24 న నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాలతో పాటు ఆ జిల్లాకి  సంబంధించి తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే మూడు అసెంబ్లీ స్థానాల సమీక్ష ఉంటుంది.