1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (12:21 IST)

చెన్నైకు జనసేనాని... విశ్వనటుడుతో పవన్ కళ్యాణ్ భేటీ?

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం చెన్నై నగరానికి వస్తున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం చెన్నైకు వస్తున్న ఆయన అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. అలాగే, తమిళనాడులో కూడా పార్టీని విస్తరించే అంశంపై కూడా ఆయన ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విశ్వనటుడు కమల్ హాసన్‌తో ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
 
డిసెంబరు 7వ తేదీన జరుగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉంది. కానీ, సోమవారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 'తెలంగాణాలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్టయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలో ప్రణాళిక రూపొందించుకున్నాం. కానీ, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేన ఎన్నికల బరిలో నిలవడం ఒకింత కష్టతరంగా భావించాం. అందుకే ఎన్నికలకు దూరంగా ఉన్నాం. కానీ, తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన పార్టీ లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ పోటీ చేస్తుందని' పవన్ ఇటీవల విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి చెన్నైకు వస్తున్నారు. ఆయన ఇక్కడ కీలక ప్రకటన చేస్తారని పార్టీ ముఖ్యనేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు. నిజానికి పవన్ మీడియా సమావేశానికి ఒక్క రోజు ముందు పార్టీ నుంచి ఆహ్వానం వస్తుంటుంది. కానీ, 48 గంటల ముందే ఆయన చెన్నై పర్యటన, మీడియా సమావేశం ఆహ్వానాన్ని పార్టీ వర్గాల ద్వారా మీడియా సంస్థలకు తెలియజేయడం వెనుకగల ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. 
 
అయితే, బుధవారం అంటే నవంబరు 21వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటారని రాజకీయ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.
 
మరికొందరు మాత్రం అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని పవన్ భావిస్తున్నారనీ, అందుకే తన రాజకీయ ఉద్దేశాలు, భవిష్యత్ ప్రణాళికలను తమిళ మీడియాతో పంచుకునేందుకే చెన్నైకు వస్తున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు.