శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:47 IST)

వైకాపాలో చేరుతాం.. కానీ సీఎం జగన్ అలా చేయాలి : జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లాలో అత్యంత కీలకంగా ఉన్న రాజకీయ నేతల్లో జేసీ బ్రదర్స్ ఉన్నారు. వీరిద్దరూ ఒకే మాట, ఒకే బాటపై నడుస్తుంటారు. అయితే, ఇటీవల వాహనాల కొనుగోలులో జరిగిన అక్రమాల కేసులే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం షరతులతో కూడిన బెయిల్‌పై మంజూరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
రాజకీయ వేధింపుల్లో భాగంగానే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. రవాణా శాఖ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించామని, జైలు అధికారులు ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తనపై నిఘా ఉంచారని వ్యాఖ్యానించారు. 
 
ముగ్గురు ఎమ్మెల్యేలు తాను జైల్లో ఎలా ఉంటున్నానో నిఘా వేసి ఉంచారని, జైల్లో తన కదలికలపై ఎప్పటికప్పుడు ఆరాతీశారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి , అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరికొంతమంది రాయలసీమ నేతలు.. జైల్లో ఇబ్బందులు పెట్టేలా బయట నుంచే శతవిధాలా ప్రయత్నించారని తెలిపారు.
 
ముఖ్యంగా, కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని జైల్లోనే చంపేయాలని చూశారని ఆరోపించారు. 68 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిని కరోనా సమయంలో జైల్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అయితే, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాడిపత్రి ప్రజల్లో నూతనోత్సాహం చూశానని, గతంలో ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి రాని మహిళలు సైతం బయటకు వచ్చి హారతులు ఇచ్చారని, ఇది తన జీవితంలో మరచిపోలేని విషయమన్నారు.