మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2017 (13:55 IST)

కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తా.. అర్థం చేసుకోండి: రేవంత్

తన వర్గానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తానని, అంతవరకు తననేమీ అడగవొద్దని టీడీపీకి రాజీనామా చేసిన ఏ. రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. తాను తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాల్సి వచ

తన వర్గానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడి మీ ముందుకు వస్తానని, అంతవరకు తననేమీ అడగవొద్దని టీడీపీకి రాజీనామా చేసిన ఏ. రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. తాను తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో స్పష్టంగా వెల్లడిస్తానని తెలిపారు. 
 
ఆదివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రేవంత్, మీడియాతో రెండే రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. తాను నేడు కార్యకర్తలతో సమావేశం కావాల్సి వుందని, ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాల్సి వుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడతానని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీకి కూడా వెళ్లనని చెప్పిన ఆయన, తనను అర్థం చేసుకోవాలని మీడియాను కోరారు. 
 
ఇదిలావుండగా, టీడీపీలో రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. దాదాపు పది రోజుల నాడు రేవంత్ ఢిల్లీ పర్యటనతో మొదలైన ఈ వివాదం, శనివారం టీడీపీకి ఆయన రాజీనామాతో సమసిపోయినా, ఇంకా వేడి మాత్రం తగ్గలేదు. ఢిల్లీ పర్యటన తర్వాత, తన రాజీనామాకు ముందు రేవంత్ తెలుగుదేశం నేతలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలను టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆ సమయంలో రేవంత్ విమర్శలను అంతే గట్టిగా ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వారు కేసీఆర్‌తో స్నేహం పెట్టుకుని ఆయన్నుంచి కాంట్రాక్టులు పొందుతున్నారని రేవంత్ ఆరోపించగా, నిజామాబాద్ ఎంపీ కవితతో రేవంత్‌కు వ్యాపార బంధముందని ఏపీ నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఇక రేవంత్ రాజీనామా తర్వాత, ఆయనపై మరిన్ని ఆరోపణలు చేస్తారని అందరూ భావించగా, ఆశ్చర్యపూర్వకంగా ఒక్కరు కూడా ఆరోపణలు చేయలేదు సరికదా... ఎవరూ నోరు మెదపడం లేదు. 
 
తమ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రేవంత్‌ను విమర్శించడం లేదని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో ఇబ్బంది పట్టిన ఓటుకు నోటు కేసు నుంచి పలు అంశాల్లో రేవంత్‌తో గతంలో ఉన్న సంబంధాలు కొనసాగాల్సి వుండటంతో కాస్తంత మెతకగానే ఉండాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే రేవంత్‌ను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.