శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదొవ రోజైన గురువారం (ఆశ్వయుజ శుద్ధ పంచమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు.
టిక్కెట్టు రుసుము రూ.3వేలు నిర్ణయించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శత చండీయాగం నిర్వహిస్తారు. టిక్కెట్టు రుసుము రూ.4వేలు నిర్ణయించారు.
ఆన్‌లైన్లో కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు జగన్మాత దుర్గమ్మకు మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ రుత్వికులు సమర్పిస్తారు.
ఆ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. వేకువ జామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కనకదుర్గానగర్‌లో లడ్డు, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తారు. అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.
భక్తులందరికి అమ్మవారి దర్శనం లభించేలా ప్రతి ఒక్కరు సహకరించాలని విజయవాడ కమీషనర్ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంద్రకీలాద్రిపై మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఉదయం నుండే అనూహ్యంగా పెరిగిందని పేర్కొన్నారు.
సాధారణ భక్తులకు, రు.300 టిక్కెట్లు కొనుకున్న భక్తులకు క్యూలైన్లలో కలుగుతున్న అసౌకర్యం తన దృష్టికి రావడంతో స్వయంగా క్యూలైన్లను పరిశీలించామన్నారు. దేవస్థానం అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో ఇబ్బందులకు గల కారణాలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
క్యూలైన్ల తనిఖీల సందర్భంలో విఐపిలకు, ఉత్సవకమిటీ, తదితరులకు సంబందించిన వ్యక్తులు అనధికారికంగా క్యూలైన్లలో రావడం వలన దర్శనానికి అంతరాయం కలుగుతుందన్నారు. నిర్దేశించిన సమయాలలోనే అమ్మవారి దర్శనానికి రావాలని ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు.
ఉదయం 7-8, 11 - 12, మ. 3 - 4, రా. 8 - 9 మద్య సమయాల్లోనే వీఐపి దర్శనం టిక్కెట్లు కొన్న భక్తులు వారికి కేటాయించిన సమయంలో కాకుండా ముందుగానే క్యూలైన్లలోకి ప్రవేశించడం తమ దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి నిర్ణీత సమయాలలోనే దర్శనాలకు రావాలని ఈ విషయంలో ఫిర్యాదులు రావడం జరుగుతోందని దర్శనాలపై సిబ్బంది కఠినంగానే వ్యవహరించి సాధారణ భక్తులకు, ఉభయదాతలకు మెరుగైన దర్శనానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఉభయదాతల కోసం ప్రత్యేక క్యూలైన్లు ద్వారా త్వరితగతిని దర్శనం జరిగేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు . మూలా నక్షత్రం రోజున భక్తులకు మరింత మెరుగైన దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా స్వచ్చంద కార్యకర్తలు, ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్‌ల సహాకారంతో పోలీసులను సమన్వయం చేసుకుంటున్నామని సీపి ద్వారకా తిరుమలరావు తెలిపారు.