వైకాపా నేతల వేధింపులు.. అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా వైకాపా నేతల వేధింపులు భరించలేక ఓ అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలోని గురువిందగుంట గ్రామంలో శనివారం జరిగింది.
గ్రామంలో 20 యేళ్లుగా ఆంగన్‌వాడీ టీచర్ పనిచేస్తున్న అన్నపూర్ణను అదే గ్రామ వైసీపీ నాయకులు వారం రోజులుగా వేధిస్తున్నారు. వేరే ప్రాంతంలో ఉంటున్న వారికీ అంగన్‌వాడీ నుంచి ఆహార పదార్థాలు ఇవ్వాలని, తాము చెప్పినట్లు వినాలని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించసాగారు.
అంగన్‌వాడీకి వచ్చే పోషకాహారం గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయడంలేదని అల్లరి చేస్తామని, తమకు అనుకూలమైన వారిని అంగన్‌వాడీ టీచర్‌గా ఎంపిక చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్యాయత్నం చేసింది. తన చావుకు ఎంపీటీసీ సభ్యుడు వేమూరి మోహన్, అతని అనుచరులు సత్యనారాయణ, దారం జోజిబాబ కారణమని ఓ లేఖ రాసిపెట్టింది.
ప్రస్తుతం ఆమె గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద మండలంలోని అంగ న్వాడీ టీచర్లు ఆందోళన నిర్వహించారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐసీడీ సీఎస్ అధికారులు అంగన్‌వాడీ టీచర్ అన్నపూర్ణను పరామర్శించారు. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని, ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు.