సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (20:25 IST)

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దిశ ప్రత్యేక కేంద్రాన్ని తనిఖీ చేసిన కృతికా శుక్లా

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్‌ను దిశా చట్టం ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేసారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన శుక్లా కేంద్రంలోని పలు గదులు నిరుపయోగంగా ఉండటాన్ని గమనించారు. ఆసుపత్రిలో పలు గదులు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం కింద ఉన్నప్పటికీ, ఉపయోగించని గదులను ఖాళీ చేయాలని, వాటిని దిశ చట్టం అమలు కోసం వినియోగించవలసి ఉంటుందని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను అదేశించారు. 
 
ఆసుపత్రి ఆవరణలో దిశ వైద్య పరీక్షలు, జీరో ఎఫ్ఐఆర్ నమోదు గది, వేచి ఉండే గది, కౌన్సెలింగ్, ఆశ్రయం కల్పించే గదులను  గుర్తించిన కృతికా శుక్లా తదనుగుణంగా వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. బాధితులు సురక్షితంగా ఉండటానికి అవసరమైన వసతులను సిద్ధం చేయాలని కేంద్రంలోని సిబ్బందికి స్పష్టం చేసారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేసిన డాక్టర్ కృతిక, దిశా చట్టం అమలులో ఆయా అధికారుల విధులను వారికి వివరించారు
 
మహిళా మిత్రల సేవలు అత్యావశ్యకం: డాక్డర్ కృతికా శుక్లా
మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా దర్యాప్తు చేయడానికి మహిళా మిత్రలు కృషి చేయాలని దిశా ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా సూచించారు. విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ నేతృత్వంలో మహిళల భద్రతలో మహిళా మిత్రల పాత్ర అనే అంశంపై జరిగిన ఒక రోజు సదస్సుకు శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారాకా తిరుమల రావు తదితరులు పాల్గొన్న ఈ సదస్సులో డాక్టర్ కృతిక మాట్లాడుతూ అందుబాటులో ఉన్న చట్టాలను గురించి మహిళా మిత్రలు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. దిశా ప్రత్యేక చట్టం యొక్క నిబంధనలను వివరించారు. గ్రామ సచివాలయ పరిధిలో గ్రామ కార్యదర్శి, మహిళా మిత్రా ఒక బృందంగా పనిచేసి గ్రామ స్థాయిలో దిశా చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. 
 
మహిళలు, పిల్లలపై నేరాల నివారణకు కృషి చేయాలని, వారు తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు సురక్షితమైన, అసురక్షిత స్పర్శ గురించి అవగాహన కల్పించాలని నిర్ధేశించారు. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న వివిధ సంస్థల గురించి అవగాహన కల్పించటమే కాక, 100, 112, 181 యొక్క కాల్ సెంటర్ నంబర్లను కూడా మహిళలకు అందిస్తూ వాటిని ఎలా ఉపయోగించాలన్న దానిని వివరించాలన్నారు. సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రభుత్వేతర సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.