గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (17:40 IST)

వర్రా రవీంద్రా రెడ్డి అరెస్టు.. తాడేపల్లి కార్యాలయం నుంచే అసభ్యకర పోస్టులు : డీఐజీ ప్రవీణ్

varra ravindra reddy
వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిలోని కార్యాలయం నుంచే అసభ్యకర పోస్టులను పెట్టెవాడని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత తదితులపై అసభ్యకర పోస్టులను పెట్టిన కేసులో గత రెండు మూడు రోజులుగా పరారీలో ఉన్న వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేసారు. ఆదివారం మార్కాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఈ కేసులో వర్రా రవీందర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను కోయా ప్రవీణ్‌, కడప ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మీడియాకు వివరించారు.
 
'నిందితులు వాడిన భాష అసభ్యకరంగా ఉంది. అరబ్‌ దేశాల్లో అయితే తీవ్ర శిక్షలు ఉంటాయి. సీఎం, డిప్యూడీ సీఎం కుటుంబాలపై తీవ్రమైన దూషణలు వాడారు. వర్రా రవీందర్‌రెడ్డి గతంలో భారతి సిమెంట్స్‌లో పని చేశాడు. మరో ఇద్దరు కూడా వైకాపా సోషల్‌ మీడియాలో పని చేస్తున్నారు. డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను వైకాపాకి అనుకూలంగా వినియోగించుకున్నారని నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారు. 
 
న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారు. మహిళా కుటుంబసభ్యులు, వారి పిల్లలపై పోస్టులు పెట్టారు. ఇలాంటి వారిని 45 మందిని గుర్తించాం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నాయకుల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పోస్టులు పెట్టేవారు. నిందితులకు 40 యూట్యూబ్‌ ఛానెళ్లు ఉన్నట్లు గుర్తించాం. వాటి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం నుంచి వీటిని నడిపేవారని ప్రవీణ్ తెలిపారు.