శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (12:16 IST)

హమ్మయ్య.. దుర్గమ్మ వంతెన పిల్లర్ల ఆకృతులకు ఆమోదం... 2019లో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెజవాడ కనకదుర్గ వంతెన పిల్లర్ల ఆకృతులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఈ వంతెన పిల్లర్ల ఆకృతులను అంతర్జాతీయ ప్రమాణాలతో ముంబైకి చెందిన ఓ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెజవాడ కనకదుర్గ వంతెన పిల్లర్ల ఆకృతులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఈ వంతెన పిల్లర్ల ఆకృతులను అంతర్జాతీయ ప్రమాణాలతో ముంబైకి చెందిన ఓ సంస్థ రూపొందించింది. పైవంతెన నిర్మాణం వచ్చే యేడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని సోమా కనస్ట్రక్షన్‌ సంస్థ ఎండీ వెల్లడించారు.
 
వచ్చే యేడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించిన విషయం తెల్సిందే. దీనికి జనవరి 26కు అవకాశం ఇవ్వాలని ఎండీ కోరినట్లు తెలిసింది. కనకదుర్గ పైవంతెన నిర్మాణంపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. వచ్చే యేడాది జనవరికి ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. 
 
అయితే, బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం నుంచి కొంత సమస్య ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈనెల 11న కేంద్ర మంత్రి గడ్కరీ రాజమహేంద్రవరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళతానని సీఎం అధికారులకు, సోమా కంపెనీ ఎండీకి హామీ ఇచ్చారు. నాలుగు వరసల రహదారి, ఆరు వరసల కనకదుర్గ పైవంతెన కలిపి రూ.448.60 కోట్లకు సోమా దక్కించుకుంది. ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇది జాతీయ రహదారి కావడంతో దీన్ని కేంద్రం చేపట్టి, పర్యవేక్షణ బాధ్యతలు రహదారులు, భవనాల శాఖలో జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. 
 
ఈనేపథ్యంలో కనకదుర్గ పైవంతెన నిర్మాణంలో ఆరు పిల్లర్లకు సీడీఓ ఆమోదం లభించింది. పైవంతెన మలుపు తిరిగే ప్రాంతంలో డయాగ్నల్‌గా నిర్మాణం చేయాల్సి ఉంది. అక్కడ సరిపడే స్థలం లేకపోవడంతో పియర్స్‌ ఒకవైపే నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి ఆకృతులను కేంద్రం మొదట తిరస్కరించింది. ఎట్టకేలకు ముంబైకి చెందిన సంస్థ రూపొందించి అంతర్జాతీయ సంస్థతో ధ్రువీకరణ పొందడంతో సీడీఓ ఆమోదం తెలిపింది. నగరపాలక సంస్థ పంపుహౌస్‌ దగ్గర రెండు పిల్లర్లు, నదిలో రెండు పిల్లర్లు, దర్గా ప్రాంతంలో రెండు పిల్లర్లను ఈ విధంగా నిర్మాణం చేయనున్నారు. సాధాణంగా 16 మీటర్లకు రెండు పియర్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత డిజైన్ల ప్రకారం 16 మీటర్లకు ఒకవైపు ఒక పియర్‌ ఏర్పాటు చేస్తారు.